సాంప్రదాయక శిశు సంరక్షణా పద్ధతులు – ఆవశ్యకత

సాంప్రదాయక శిశు సంరక్షణా పద్ధతులు – ఆవశ్యకత

ఆరోగ్య పద్ధతులు, సూచనలను గురించి తల్లిదండ్రులు, పెద్దలు కొన్ని వందల సంవత్సరాల నుంచి శిశుసంరక్షణ చేపడ్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. ఇందులో కొన్ని పద్ధతులు శాస్త్రీయ పరంగా మంచివైనప్పటికి కొన్ని పద్ధతులు మాత్రం పూర్తిగా మూఢనమ్మకాలపైనే ఆధారపడి ఉంటే మరికొన్ని పద్ధతులు మానసిక తృప్తికోసం మాత్రమే పాటింపబడుతున్నాయి.

స్త్రీకి పరిపూర్ణత బిడ్డకు తల్లి అయినప్పుడే వస్తుంది, అంతేకాక మొదటి కానుపు స్త్రీకి చాలా ముఖ్యమైనది సిగ్గు, బిడియం సహజంగా గల స్త్రీ ఆహారపదార్ధాల ఎన్నిక, ఇష్టపడటం ద్వారా తాను గర్భిణి అనే విషయాన్ని ఇతరులకు వ్యక్తం చేయడమేకాక ప్రత్యేక గుర్తింపును పొందగల్గుతుంది. ఇది ఆమెను సంతోషంగా ఉంచడమేకాక తన మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. సహజంగా గర్భిణి స్త్రీకి తనకు పుట్టబోయే బిడ్డ అందంగా ఉంటాడా లేదా అని, అంగవైకల్యం గల బిడ్డ పుడ్తాడేమో అని తన బరువు పెరుగుదల మీద కానుపు నొప్పులమీద, భవిష్యత్తులో కుటుంబంలో చేసుకొనే సర్ధుబాటు మీద ఎక్కువ భయం, ఆందోళన ఉంటాయి.

సాధారణంగా ఏడవ నెలలో చేసే శ్రీమంతం అనే పేరంటం వల్ల తల్లులయిన స్త్రీలందరు ఒక చోట చేరి తమతమ అనుభవాలను గర్భిణి స్త్రీకి చెప్తూ ఆమె ప్రతిరోజు ఎలా ఉండాలో, కానుపు నొప్పుల గురించి, బిడ్డ సంరక్షణ గురించి చెప్తూ ఆమెకు గల భయాందోళనలను పొగొడ్తారు.

గర్భంలోని బిడ్డ ఆడ లేదా మగ అనే విషయాన్ని గర్భిణి స్త్రీ పొట్ట అడ్డంగా లేదా నిలువుగా ఉబ్బిందా, గర్భం స్థానాన్ని బట్టి, గర్భిణి స్త్రీ నడకను బట్టి, ఆమె ఏ పనులంటే ఇష్టం చూపుతుంది అనే విషయాలను బట్టి ఊహించడం జరుగుతుంది. సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ మగబిడ్డనే కావాలనుకొంటారు కాబట్టి గర్భిణి స్త్రీకి ఎప్పుడూ తన గర్భంలో శిశువు మగబిడ్డ కాదేమో! ఆడబిడ్డ అయితే కుటుంబంలోని సభ్యులు తనని చిన్నచుపు చూసి నిందలు వేస్తారనే భయాందోళనలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితులలో గర్భిణి స్త్రీ ఉపవాసం ఉంటూ మగబిడ్డను ప్రసాదించమని దేవుడ్ని ప్రార్ధించడం కూడా జరుగుతూ ఉంటుంది. మన సాంప్రదాయం ప్రకారం గర్భం చివరి దశలో గర్భిణి స్త్రీ తన పుట్టింటికి వెళ్ళడం పరిపాటు. దీనివల్ల ఆమె తన భయాందోళనలను విడనాడి కొత్తగా తమ ఇంట్లో ప్రవేశించే బిడ్డ వల్ల వచ్చే సంతోషాన్ని, భావాలను తన వారితో పంచుకోవడం వీలవుతుంది.

ప్రసవం అయిన వెంటనే తల్లిని, బిడ్డను ఒంటరిగా వదిలివేయడం వల్ల వారికి అంటువ్యాధులు రాకుండా ఉండటమే కాకుండ తల్లి, బిడ్డల మధ్య అనురాగబంధం ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఇది బిడ్డ తరువాత జీవితంలో సురక్షితమైన, నమ్మకమైన మూర్తమత్వం అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం అనేది బిడ్డ ఆకలిని తీర్చడమే కాకుండా తల్లి బిడ్ద మధ్య బంధం ఏర్పడడానికి, బిడ్ద మానసికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఆటల ద్వారా ప్రేమ, అనురాగాన్ని తల్లి బిడ్డ మీద చూపుతుంది. దీనివల్ల బిడ్డ ఉషారుగా ఉండటం, బరువుపెరగడం, నరాలు ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ప్రేమ, అనురాగం లేకుండా పెరిగే పిల్లల్లో ఉద్వేగ బంధం సరిగా ఏర్పడక వారి మానసికాభివృద్ధి పై ప్రభావం చూపుతుంది. తల్లి భావాలను, మాటలను పిల్లలు సుళువుగా అర్ధం చేసుకొని దానికనుగుణంగా వారి భావాలను వ్యక్తం చేయగల్గుతారు. పిల్లలకు ప్రేమతోకాక ఇష్టం లేకుండా త్వరత్వరగా కోపంగా శరీర మర్ధన చేయడం వల్ల అదివారి మానసికాభివృద్ధిపై చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది. పుట్టిన బిడ్డ కూడ తనని ఎత్తుకున్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పగలిగి ఉంటారు.

ఇంకో ముఖ్యమైన సంప్రదాయ శిశుసంరక్షణా అలవాటు పిల్లల ఊయలలపై, పిల్లలున్న గదిలో రంగురంగుల బొమ్మలుంచడం, బొమ్మలు వ్రేలాడదీయడం వంటివి. ఇవి పిల్లల శ్రవణ, దృశ్య, స్పర్శ జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి, అంతేకాక చిన్న పిల్లలతో మాట్లాడడం, పాటలు పాడటం వారిని దగ్గరగా హత్తుకోవడం వంటి పనులవల్ల పిల్లల అభివృద్ధిని ఉత్తేజపరచినట్లు అవుతుంది. ఇలాంటి ఉత్ర్పేరక వాతావరణం చిన్నప్పటి నుంచి పిల్లలకు లేకుంటే అదివారి భాషాభివృద్ధి, మానసికాభివృద్ధి మీద, తరువాత వయస్సులో ఎంతో ప్రభావం చూపుతుంది. ఇలా మనకు తరతరాలుగా సంప్రదాయబద్దంగా వస్తున్న శిశు సంరక్షణ పద్ధతులు కొన్ని మంచివే కాని కొన్ని పద్ధతులు పిల్లల అభివృద్ధిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు మగబిడ్డనే కావాలని ఆశించడం వల్ల ఆడబిడ్డ అంటే ఇష్టం పోతుంది, ఆడబిడ్డను సంతోషంగా మన కుటుంబంలోనికి ఆహ్వానించలేము అంతేకాక గర్భిణి స్త్రీ ఆడబిడ్డను ప్రసవిస్తే ఆమె తక్కువ దానిని అనే భావనను అనుభవించాల్సి వస్తుంది. ఇవన్ని ఆడబిడ్డ పెంపకం మీద ప్రభావం చూపి బిడ్డ భవిష్యత్తు, అభివృద్ధి పై వ్యతిరేక ప్రభావం చూపుతాయి.

మధ్యప్రదేశ్ లోని చుబల్ లోయలో పుట్టిన వెంటనే బిడ్డ ఏడ్వకపోతే మామను బాగా త్రొక్కి బిడ్డ మొదటి శ్వాసను పీల్చుకొనేటట్లు చేస్తారు. పుట్టిన మొదటి, రెండు, మూడు రోజులు బిడ్దకు నీరు, ఆవుమూత్రం, పంచదార నీటిని ఆహారంగా ఇస్తారు.

గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాలలో గర్భం నిల్వని స్త్రీలు, చనిపోయిన బిడ్డను ప్రసవించే స్త్రీలు తనకు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలనే ఆశతో ఇతరులను పాత గుడ్డలు, ఇతర వస్తువులు భిక్షం అడుక్కుంటారు. పిల్లల తల గుండ్రని ఆకారం కల్గి ఉండాలని బెంగాల్ లోని స్త్రీలు ఆవాలతో కుట్టిన దిండును పుట్టిన బిడ్డలకు తలగడగా వాడతారు, కొన్ని ప్రాంతాల్లో జంట అరటిపళ్ళను తింటే అతికి ఉండే కవల పిల్లలు పుడతారని అపోహ కలదు. బొంబాయి లోని మురికి వాడల్లో కొందరు ఊడిన బిడ్డ బొడ్డును ఎండబెట్టి పొడిచేసి కొన్ని మందుల్లో వాడటం జరుగుతుంది, ఈ మందులను ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులకు, పుట్టిన పిల్లల్లో కళ్ళకలకను పోగొట్టడానికి మందుగా వాడ్తారు, గాడిదపాలు, తల్లిపాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయనే భావనతో తమిళనాడులో పుట్టిన పిల్లలకు గాడిదపాలను ఇస్తారు, గర్భిణి స్త్రీ తనకు కూడ మగబిడ్డ పుడ్తాడనే అపోహలో వేరే పిల్లలకు ఊడిన బొడ్డునుగాని, తలవెంట్రుకలు గాని తింటారు.

Share this post


Watch Dragon ball super