పుట్టగొడుగుల పెంపకం

పుట్టగొడుగుల పెంపకం

వృక్షశాస్త్ర వర్గీకరణలో పుట్టగొడుగులు ఫoగై జాతికి చెoదిన చిన్న మొక్కలు. సాధారణంగా పుట్టగొడుగులు అనేవి వర్షాకాలంలో బాగా తేమగా ఉండే ప్రదేశాల్లోనూ, చెట్ల దుంగల పై పెరుగుతూ కనిపిస్తాయి. పుట్టగొడుగుల్లో పోషక పదార్ధం ఎక్కువగా లభ్యం కావటం వల్ల ఇటీవల కాలంలో పుట్టగొడుగులను కృత్రిమంగా పెంచే విధానం పై ఆసక్తి పెరిగింది. అంతేగాకుండా బయట సహజంగా పెరిగే జాతులన్ని తినేవికావు. కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రెండువేల రకాల పుట్టగొడుగులు లభ్యమవుతున్నప్పటికీ శాస్త్రీయ పద్ధతిలో 3 రకాల పుట్టగొడుగులు కృత్రిమంగా పెంచటానికి అనువైనవిగా గుర్తించారు. అవి

వైట్ బటన్ పుట్టగొడుగులు (అగారికస్ బైస్పోరస్):

ఈ రకం పుట్టగొడుగులు 14-16 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత కలిగి, 85-95 శాతం గాలిలో తేమ ఉండే చల్లని ప్రదేశాలలో మాత్రమే బాగా పెరుగుతాయి. అందువల్ల వీటి పెంపకానికి ఇన్సులేటేడ్ గదులు, ఏసి, హుమిడిఫైయార్ వంటి ఆధునిక పరికరాలు అవసరం కాబట్టి పెట్టుబడి అధికం.

puttagodugula-pempakam-3

వరిగడ్డి పుట్టగొడుగులు (వాల్వోరియోల్లీ వాల్వేసియా):

ఈ రకం పుట్టగొడుగులను వరిగడ్డిని ఉపయోగించి పెంచుతారు వీటి కాడలు మృదువుగా ఉండి 38 సెం.మీ. పొడవు ఉంటాయి. వీటి పెరుగుదలకు, 30 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి, 85-90 శాతం గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూలం. ఆకర్షణీయంగా, రుచిగా మంచి పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ తక్కువ పంట ఉత్పత్తి వల్ల వాణిజ్య సరళిలో తక్కువగా పండిస్తునారు.

puttagodugula-pempakam-2

ముత్యపు చిప్ప లేదా ఆయిస్టర్ పుట్టగొడుగులు (ప్లూరోటస్ స్పీసిస్):

ప్లూరోటస్ జాతులు 25-32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 70-85 శాతం గాలిలో తేమ పరిస్థితుల మద్య బాగా పెరుగుతాయి. వీటిని రైతులు తమ వద్ద ఉండే వరిగడ్డితోనేగాక ఇతర వ్యవసాయ సంబంధిత వ్యర్థపదార్థాల పై కూడా సులభంగా పెంచవచ్చు. కాబట్టి ఇవి తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలనిచ్చే రకంగా ప్రాచుర్యం సంతరించుకున్నాయి.

puttagodugula-pempakam-1

ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు విధానం:

కావలసిన వస్తువులు

• పూరిపాక గది
• వరిగడ్డి ముక్కలు (3-4సెం.మీ.పొడవు)
• పాలిథీన్ సంచులు 12X24అంగుళాలు (100 గేజ్ మoదo కలవి)
• కొయ్య లేదా స్టీలుతో చేసిన అరల చట్రం
• జనపనార గోతం సంచులు
• పుట్టగొడుగుల విత్తనo
• డెట్టాల్ లేదా స్పిరిట్
• సన్నని ఇనుపకడ్డి
• ట్రే
• చాకు లేదా బ్లేడు
• రబ్బరు బ్యాoడ్లు
• స్ప్రేయర్

సాగు చేసే విధానం:

• పుట్టగొడుగులు పెంచడానికి ముందుగా ఏడాదిలోపు శుభ్రమైన ఎండుగడ్డిని సుమారు 3-4 సెం.మీ.పొడవు ముక్కలుగా చేసిన తరువాత 24 గంటలపాటు శుభ్రమైన మంచినీటిలో నానబెట్టి తీయాలి.
• నీటిలో నానిన ముక్కలను మరుగుతున్న నీటిలో 100 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద అరగంటసేపు ఉడకబెట్టటం ద్వారా లేదా 100 కిలోల గడ్డిముక్కలను 100 లీటర్ల మందునీటిలో 10గంటల పాటు ఉంచడం ద్వారా అన్ని బాక్టీరియాలు, శిలీంద్రాలు నాశనం చేసి గడ్డిని శుభ్రపరచవచ్చు.
• పైన పేర్కొన్న రెండు పద్దతుల్లో ఎదో ఒక పద్ధతి లో శుద్ధి చేసిన గడ్డిముక్కలలో ఎక్కువగా ఉన్న నీటిని తీసేసి, సుమారు అరగంటపాటు నీడలో శుభ్రమైన స్థలంలో ఆరనివ్వాలి.
• పాలిథీన్ సంచిని తీసుకొని అక్కడక్కడ రంధ్రాలుచేయాలి. సంచి చివర భాగం దగ్గరకు చేసి దారంతో లేదా రబ్బరు బ్యాండ్ తో కట్టాలి. శుద్ధిచేసిన గడ్డిముక్కలను సంచిలో 5 సెం.మీ మందం వరకు వేసి దానిపై గుప్పెడు స్పాన్ ను కవరులోని గడ్డి అంచుల వెంబడి సమానంగా వేయాలి.
• అదేవిధంగా 5 సెం.మీ మందం గల పొరను ఒకదానిపై ఒకటిగా వేయాలి. ప్రతి పొరపైన స్పాన్ ను తప్పని సరిగా వేయాలి. సంచుల మూతులను దారంతో గట్టిగా కట్టి చట్రపు అరలతో ఒకదాని పక్కన మరొకటి పేర్చాలి.
• ఈ సంచులు పెట్టేముందు గదిలో 2 శాతం ఫార్మలిన్ ద్రావణాన్ని గది మొత్తం తడిచేల పిచికారి చేయాలి.
• సుమారు 18 నుండి 22 రోజుల్లో గడ్డిముక్కలపై బెడ్ అంతటా తెల్లని బూజు దట్టంగా వ్యాపిస్తుంది. ఈ దశలో బ్లేడ్ తో పాలిథీన్ సంచిని చీల్చి విడదియ్యాలి.
• ఇప్పటినుంచి గొడుగు దశ ప్రారంభం అవుతుంది. పాలిథీన్ సంచి విడతీసిన తరువాత బెడ్ పై కూడా ఎప్పుడు తడిగా ఉండేటట్లు నీరు పిచికారి చేయాలి. పాలిథీన్ సంచి తీసివేసిన 4-5 రోజుల్లో చిన్న గుండుసూదుల సైజులో ముందుగా పుట్టగొడుగులు బయటకు వస్తాయి.
• మరో రెండు, మూడు రోజుల్లో పెద్దగైన పుట్టగొడుగులను కాడ మెలితిప్పి ఏరోజుకు ఆ రోజు కోసుకోవాలి.
• గదిలో ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని క్రమబద్ధీకరించుకుంటే, మళ్లీ వారం పదిరోజులకు రెండవ కాపు వస్తుంది. ఇలా 2-3 కాపులు తీసుకున్న తరువాత బెడ్ ని తీసివేసి కంపోస్ట్ గుంటలో పడేయవచ్చు.
• కోసిన పుట్టగొడుగులను రంధ్రాలు చేసిన ప్లాస్టిక్ కవర్ లో సీలు చేసి 12 గంటల్లో మార్కెట్ చేసుకోవాలి. ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.

పుట్టగొడుగుల పెంపకం వల్ల ఉపయోగాలు:

• పుట్టగొడుగుల్లో బాగా పోషకవిలువలు ఉన్నందువల్ల పోషకాహార లోపంతో బాధపడేవారికి, మహిళలకు, గర్భిణి స్త్రీలకూ, చిన్నపిల్లలకు మంచి ఆహారం.
• పుట్టగొడుగుల పెంపకానికి అయ్యే ఖర్చు తక్కువ.
• పుట్టగొడుగుల పెంపకానికి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడనవసరం లేకుండ తేలిగ్గా పెంచవచ్చు.
• మహిళలు ఖాళీ సమయాల్లో వీటిని పెంచి అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

పుట్టగొడుగుల్లో పోషకవిలువలు:

• పుట్టగొడుగుల్లో శరీరానికి అవసరమయ్యే అనేక పోషక పదార్థాలు కలవు. పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
• ఇందులో తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృత్తులు ఉండడం వల్ల ఇది అన్ని వయసుల వారికి మంచి పోషకాహారం మాంసకృత్తుల్లో పెరుగుదలకు కావలసిన లైసిన్ ఎమైనో ఆమ్లం కలదు.
• బి గ్రూపు విటమిన్ లైన నియాసిన్, రైబోఫ్లేవిన్, ఫాంటోథెనిక్ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం ఎక్కువ మోతాదుల్లో కలవు.
• చెక్కర, క్రొవ్వుపదార్ధాలు చాలా తక్కువ మోతాదుల్లో ఉంటాయి. స్థూలకాయులు బరువు తగ్గటానికి కూడా వాడవచ్చు.
• చెక్కర శాతం తక్కువగా ఉండుటచే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా సురక్షితంగా ఈ పుట్టగొడుగులను ఎల్లప్పుడూ వాడవచ్చును.
• పుట్టగొడుగుల్లో పొటాషియం అధికంగా ఉండడం వలన రక్తపోటును తగ్గిస్తుంది. అలానే క్రొవ్వు లేకపోవుటచే రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది మంచి ఆహారం.
• అధిక పీచు కలిగి ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ప్రస్తుతం కొన్ని రకాల పుట్టగొడుగులను క్యాన్సర్ ను తగ్గించే మందుల్లో కూడా వాడుతున్నారు.
• పుట్టగొడుగుల్లో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువ.
• పుట్టగొడుగులు గుండె సంబంధితవ్యాధులను తగ్గిస్తాయి.
• పుట్టగొడుగుల్లో విటమిన్-D పుష్కలంగా లభిస్తుంది. ఎముకలు దంతపుష్టికి సహకరిస్తుంది
• పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి, కండరాలకు, ఆక్సిజన్ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది.
• పుట్టగొడుగులు ఆహారంగా తీసుకోవడం వలన డయాబెటీస్ ని తగ్గిస్తుంది.
• పుట్టగొడుగు ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉండి రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

మార్కెట్ వివరాలు:

తాజా లేక ఎండబెట్టిన పుట్టగొడుగులను పాలిథీన్ కవర్లలో ప్యాక్ చేసి హోటళ్లకు, సూపర్ మార్కెట్లకు, రైతుబజార్లలో, ఇండ్లకు సరఫరా చేయవచ్చు. వీటిని పచ్చళ్ళు, మసాల పౌడర్, బిస్కెట్లు, అప్పడాల రూపంలో నిల్వచేయవచ్చు.

పోషకవిలువలు:

పుట్టగొడుగులు క్యాలరీలు (K.Cal)క్రొవ్వు (గ్రా)
పిండిపదార్ధాలు
(గ్రా)

మాంసకృత్తులు
(గ్రా)

వైట్ బటన్ పుట్టగొడుగులు 26
0.34
4.04
3.58
వరిగడ్డి పుట్టగొడుగులు 32
0.68
4.64
3.83
ముత్యపుచిప్ప పుట్టగొడుగులు35
0.41
6.09
3.31

Share this post


Watch Dragon ball super