పోషణలో చిరుధాన్యాల పాత్ర

పోషణలో చిరుధాన్యాల పాత్ర

ఒకప్పుడు మనదేశంలో పోషకాహార లోపమన్నది పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఆహార లభ్యత పెరిగింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వీటికి శారీరక శ్రమలేని జీవనశైలి కూడా తోదవడంతో అవసరానికి మించి తినటం ‘అధిక పోషణ ‘ అన్నది పెను సమస్యగా తయారవుతోంది. తినే ఆహారంలో బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం, బాగా శుద్ధి చేసిన రిఫైండ్ గోధుమ పిండి వంటివి వాడకం పెరిగిపోయింది. వీతన్నిటి ఫలితంగానే నేడు మనం మధుమేహం, ఊబకాయం, హై బీపి వంటి జబ్బులన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన అంశం- మన ఆహారంలో పోషకాలతో నిండిన ముడి ధాన్యాల వంటివి లేకుండా పోవటం. జబ్బులన్నీ నివారించుకోవాలన్నా, చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా మనం తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టడం మరీ ముఖ్యంగా చిరుధాన్యాల వైపు మళ్ళటం తప్పనిసరి.

poshanalo-chirudhanyaala-paatra-1

చిరుధాన్యాలన్నవి చిన్నగా మన కంటికి తేలికగానే కనిపించొచ్చు, కానీ వాస్తవానికి రుచి విషయంలో, ఆరోగ్య విషయంలో మహా దొడ్డ ధాన్యాలు. చిరుధాన్యాలతో చిరంజీవులుగా ఉండొచ్చు.

నిజానికి ఒకప్పుడు మన ప్రాంతంలో చాలా రకాల చిరుధాన్యాలను విరివిగా వాడేవారు. రోజువారీ ఆహారంలో వీటిదే కీలక పాత్రగా ఉండేది. చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు త్వరగా జీర్ణమైపోవు కాబట్టి, శారీరక శ్రమ చేసే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి అని భావించేవారు. జొన్నలు, సజ్జలు, రాగులు వంటివి, వాటితో రొట్టెలు, సంకటి, అంబలి వంటివి ఇలా ఎంతో ప్రాచుర్యంతో ఉండేవి. ఇవే కాదు అరికెలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలను వాడేవారు. అయితే రాను రాను చిన్నచూపు చూడటం మొదలైంది. ఇవి అంత రుచిగా ఉండవని, ఇవన్నీ పేదలు తినేవి అన్న భావన పెరగటంతో చిరుధాన్యాల వాడకం తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో హరిత విప్లవం కారణంగా వరి, గోధుమల పంట బాగా పెరిగి, ధరలు బాగా తగ్గటంతో ప్రజలు ప్రత్యేకంగా వీటివైపు మొగ్గు చూపటం మొదలు పెట్టారు. దీంతో ఏ వంటకాన్నైనా బియ్యం లేదా గోధుమల వంటి వాటితోనే తయారు చెయ్యటం ఆరంభమైంది. పండుగ సమయాల్లో ఏ రకం వంటకం తీసుకున్నా గోధుమ పిండి, మైదా పిండి, బియ్యం పిండి, శనగ పిండి లేదంటే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ వీటితోనే చేసుకోవటం ఎక్కువంది. ఈ పిండులు, రవ్వలన్నీ పొట్టు తీసిన, బాగా శుద్ధి చేసిన ధాన్యాల నుంచి వచ్చినవే. ఇవి చాలా త్వరగా జీర్ణమై రక్తంలో వేగంగా గ్లూకోజ్ ను పెంచుతాయి. పైగా వీటిని నెయ్యి, నూనెలతో కలిపి వండుతారు కాబట్టి శరీరానికి కేలరీలు, కొవ్వు అధికంగా అందుతాయి కానీ వీటినుండి మిగతా సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వంటివి మాత్రం అంతగా లభించవు.

చిరుధాన్యాల వినియోగం తగ్గిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎంతోమంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు.

ఇటీవల కాలంలో మధుమేహం, ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్, అధికంగా ఉండటం, ఊబకాయం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఇందుకు బాగా పొట్టు తీసిన శుద్ధి చేసిన పిండి పదార్థాలు,  కొవ్వులు ఎక్కువగా తినటమూ, మారిన జీవనశైలి ముఖ్య కారణాలు. సంప్రదాయ ఆహార పదార్థాలను వినియోగంలోకి తీసుకొస్తే ఆధునిక కాలంలో ఆరోగ్య ముప్పును జయించవచ్చు. ఇందుకు చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందనీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

poshanalo-chirudhanyaala-paatra-3

చిరుధాన్యాలు ఘనమైన పోషకాలు

చిరుధాన్యాలు పోషక పరంగా వేటికీ తీసిపోవు. బియ్యం, గోధుమ, మొక్కజొన్నల వంటి పెద్ద ధాన్యాలతో సరిసమానంగా వీటిల్లోనూ పోషకాలుంటాయి. పైగా మరికొన్ని పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి.చిరుధాన్యాలను పొట్టు తీయకుండా వాడుకునే వీలు ఉన్నందువల్ల థయమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, వంటి బి విటమిన్లు నష్టపోవటమన్నది ఉండదు. రాగుల్లో కాల్షియం, పీచు, ఇనుము ఎక్కువగా ఉంటాయి. సజ్జల్లో, కొర్రల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి.

గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ సజ్జలనుండి బాగా లభిస్తుంది. మొలకెత్తిన సజ్జలైతే మరీ మంచిది. పోషకాల స్థాయిలు పెరగడంతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి పోషకాల పరంగా ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు.

నేటి కాలానికి నిజమైన మందులు

చిరుధాన్యాల్లో పొట్టు, త్వరగా జీర్ణంకాని పిండి పదార్థాలుండటం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా చేరుతుంది. ఇది మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయి. చిరుధాన్యాల్లోని పీచు పేగుల్లో తడిని పీల్చుకుని ఉబ్బుతుంది. దీంతో కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే చిరుధాన్యాలు కాస్త నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల చిరుధాన్యాలు తినేవారు త్వరగా బరువు పెరగరు. బరువున్న వారు తగ్గటానికి ఇవి దోహదం చేస్తాయి. తగినంత పీచు పదార్థం ఉండటం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ల వంటివి రాకుండా నివరణకూ దోహదం చేస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే చిరుధాన్యాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి. జొన్నలు పసుపుగా, రాగులు ఎర్రగా, కొర్రలు కాస్త పచ్చగా, సామలు తెల్లగా, సజ్జలు నీలిరంగులో ఉంటాయి. వీటిలో ఉండే ఫైటొ కెమికల్స్ ఆయా రంగులను తెచ్చిపెడతాయి. గుణాలున్న ఈ రసాయనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

poshanalo-chirudhanyaala-paatra-4

ప్రత్యేక లాభాలు

  • సాధారణంగా చిరుధాన్యాల పంటకు చీదపీదలు పట్టవు. ఈ పంటలకు పురుగు మందులు పెద్దగా వాదరు. చిరుధాన్యాలను తీసుకుంటే క్రిమిసంహారక అవశేషాలనుండి కాపాడుకున్నట్లు అవుతుంది.
  • చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు కాస్త గట్టిగా ఉంటాయి. వీటిని నమలటం వల్ల ముఖంలోని కండరాలకు వ్యాయామం లభించి తీరైన ముఖ కవళికలు వస్తాయి.
  • చిరుధాన్యాలు అంతగా నూనె పీల్చుకోవు కాబట్టి వీటివల్ల కొవ్వు మోతాదు పెరిగే అవకాశమూ తగ్గుతుంది.
  • మనదేశంలో దాదాపు 70% మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచాలంటే శరీరానికి తగినంత ఇనుము అందాలి. ఆహారంలో తృణ ధాన్యాలు ఇనుమును అందించటంలో ముందుంటాయి.

ఎలా తీసుకోవాలి?

చిరుధాన్యాల్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవన విధానంలో చేర్చుకోవాలి. రోజువారీ తీసుకునృ ఆహారంలో కొద్దికొద్దిగా తీసుకుంటూ 50-60% వరకూ చిరుధాన్యాల పదార్థాలుండేలా చూసుకోవాలి. కొందరికి రుచి నచ్చదు. కొన్నిసార్లు అరగదు. అలాంటప్పుడు చేసుకునే విధానాన్ని ఓ సారి గమనించుకోవాలి.

Uday Lakshmi.K
Teaching Associate,
Department of FDNT,
C.H.Sc, ANGRAU,
Guntur.

Share this post


Watch Dragon ball super