పర్యావరణ చైతన్యం – అడవి తల్లికి రక్షా కవచం

పర్యావరణ చైతన్యం – అడవి తల్లికి రక్షా కవచం

అడవులు తరిగి పోవడం, భూమి మీద వాతావరణం వేడెక్కడం, అనుకోని ప్రణయకాల గర్జనలతో అవని తల్లడిల్లడం….ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. తన కాళ్ళకింద భూమికే ముప్పు తెచ్చిపెట్టే విధంగా అభివృద్ధి నమూనాల్ని అనుసరిస్తున్న మానవాళి మనుగడ ప్రశ్నార్ధకమైంది. ఈ భూమి మీద తను తప్ప మరొక జీవి ఉనికికి ఆస్కారం లేదన్నట్లుగా వ్యవహరించే స్వార్ధమానవుడి అత్యాశ జీవకోటికి పెనుముప్పుగా మారింది.

RVB de base

జీవ వైవిధ్యమంటే ఏమిటి ?

భూమిపై అన్ని స్థాయిలలో ఉన్న రకరకాల జీవజాతుల సమ్మేళనమే జీవ వైవిధ్యo, భూమిపై ఉన్న ప్రతి తెగ, జాతి సమూహంలోను, జంతువుల్లోను, క్రిమికీటకాల్లోను, సరీసృపాల్లోను, పక్షుల్లోను, వృక్ష జాతుల్లోను ప్రతిఒక్కదానికి నిర్దిష్టమైనటువంటి జన్యువులు అనువంశిక లక్షణాలు, డి యన్ ఏలు ఉండి వాటి వాటి ప్రత్యేకతను మరియు గుర్తింపును కలిగి ఉన్నాయి. భిన్నాభిన్నమూల సమ్మేళనము కూడా జీవ వైవిధ్యములోని అంతర్గత అంశాలే. ఈ జీవ వైవిధ్యము వలన మనకు తాజా నీరు, ఆహారము, గాలి, ఔషధాలు, మానవునికి కావాల్సిన రకరకాల వనరులు అందుతున్నాయి. గడిచిన కోట్లాది సంవత్సరాలుగా జరిగిన పరిణామక్రమం ఫలితంగానే మనము ప్రస్తుత జీవ వైవిధ్యాన్ని చూస్తున్నాము. మానవులతో పాటు చేతనా, అచేతన జీవుల మనుగడ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. సూక్ష్మ జీవుల నుంచి అతి పెద్ద జంతువుల వరకు జీవన క్రమంలో ఉన్నాయి. వీటన్నిటి సముహాన్నే జీవావరణము అని వ్యవహరిస్తారు.
పర్యావరణంలో ప్రధాన అంశాలైన వాతావరణము, జలావరణము, శిలావరణం మొదలైన వాటితో పాటు జీవావరణము కూడా ప్రకృతిని, అందులోని వనరులను పునర్జీవింపచేయడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నాలుగు సహజ సిద్ధమైన ఆవరణములు నిరంతరం పరస్పర సాన్నిహిత్యం కలిగి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి విచ్చిన్నమైనా మిగిలిన ఆవరణములు తీవ్రంగా నాశనం అవుతాయి. ఫలితంగా, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, అత్యంత విలువైన భూగ్రహం, త్వరితగతిన నిర్వీర్యం అవుతుంది. నీరు, గాలి, నేల కాలుష్యమవుతాయి. అడవులు, ఎడారులు, తరిభూములు, పర్వతాలు, నదులు, మంచు ఖండాలు, సముద్రాలు, గుహలు, సరస్సులు వ్యవసాయ క్షేత్రములు మొదలగు అన్ని ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాలకు అనుగుణమైన ఉప జీవావరణము లు కలిగి భిన్నమైన, జీవ వైవిధ్యంలో అలరారుతుంటాయి.

పచ్చదనానికి చిచ్చు

paryavarana-chaitanyam-adavitalliki-rakshana-5శ్వేతజాతులు విస్తరించిన మేరకు పచ్చటి నేలలు, అడవులు నాశనమయ్యాయి. పచ్చదనానికి చిచ్చు పెట్టారు. పర్యావరణం చిధ్రమైంది. మూడు దశాబ్దాల కిందట పల్లెల్లో ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. వ్యవసాయాలు చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయాలతో ముడిపడిన జంతుజాలం ఉనికి కానరాకుండా పోతుంది. పల్లెలోకి సెల్ టవర్లు వచ్చి పక్షుల జాడలేకుండా చేసినట్లు అభివృద్ధి పేరిట మనం వేసే ప్రతి అడుగు అంతిమంగా ఈ ధరిత్రికి, ధరిత్రి మీద బ్రతికే ప్రాణకోటి అస్తిత్వానికి ప్రమాదంగా తయారయింది.

కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్న వైనం:

paryavarana-chaitanyam-adavitalliki-rakshana-4లక్షల సంవత్సరాలుగా మానవ సమూహాల్ని కాపాడుతూ జీవకోటి ప్రయాణం ముందుకు సాగటానికి తోడ్పడిన ధరిత్రి కేవలం వంద సంవత్సరాల కాలంలోనే ఊహించని తాకిడికి లోనయ్యింది. ప్రతి యుగంలోనూ మానవాళి జీవితం సుభిక్షం కావడానికి తోడ్పడిన నేలని, ఈ నెల మీద జీవకోటిని మనిషి ఒక్కడే ఇష్టానుసారంగా నియంత్రించబోతే పరిణామాలు నేలతల్లి అస్తిత్వానికి పెనుముప్పుగా పరిణమించాయి. ఆధునిక అభివృద్ధి పేరిట తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే చందాన మనిషి పోకడలు బయల్దేరాయి. అడవులపై వేటు అడవుల్ని, కొండల్ని, నదుల్ని కబళించే భారీ ప్రాజెక్టులు ఒరగబెట్టేదేమిటని ప్రశ్నిస్తున్నారు. అడవులకు, అడవుల్లో జీవించే వారి హక్కులకు భంగం వాటిల్లుతున్న కారణంగానే మేధాపాట్కర్ నాయకత్వంలో నర్మదా డ్యామ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ పట్ల వ్యతిరేకతకు కూడా ఇదే కారణం. అడవులు, అడవుల్లో జీవించే వారి సంస్కృతి సమస్తం పోలవరం డ్యామ్ లో కొట్టుకుపోతుంది. అందుకని పోలవరం డ్యామ్ ను ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఒక వైపున అడవుల నరికివేతను అంతర్జాతీయ సమాజం వ్యతిరేకిస్తుంటే, మరో వైపున అభివృద్ధి పేరిట ఇక్కడ అడవుల నరికివేతకు అనుకూల చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణ విద్వంసం ఎలా కొనసాగుతుందో, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఏమి చెయ్యాలో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.

ఎవరి కోసం ఈ అభివృద్ధి ?

యూరోపియన్, అమెరికాల అభివృద్ధి నమూనాల ఫలితంగా భారతదేశంలోను సాంప్రదాయక జీవన వ్యవస్థలోని మేలిమి అంశాలన్నీ దెబ్బతిన్నాయి. బావులు, చెరువులు, వాగులు, వంకలు, చెట్లు, చేమలతో గ్రామీణ జీవితంలోని వైవిధ్యం క్రమంగా మసకబరుతూ వచ్చింది. గాంధీజీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం, చేతి వృత్తుల కన్నా భారీ పరిశ్రమలు, భారీ ప్రాజెక్టులు ఏవో ఒరగాబెడతాయనుకున్నాం. కానీ నిలువ నీడ కూడా లేని స్తితికి మనుషుల్ని నెట్టివేసాయి. గుక్కెడు నీళ్లు కూడా దొరక్క వేలాది గ్రామాలు అల్లడిల్లాల్సిన దుస్తితిలోకి నెట్టబడ్డాయి. ప్లాస్టిక్ విషం వ్యాపించింది. ఈ రాష్ట్రంలో వాగులు, చెరువులు ఎండిపోవడం వెనుక మనకు సరితూగని విధానాన్ని ప్రభుత్వం అనుసరించడమే ప్రధాన కారణం.

paryavarana-chaitanyam-adavitalliki-rakshana-6వాగుల్లోని ఇసుకను పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి తరలించుకుపోతున్నారు. ఇక గ్రామాల్లో బోర్లు ఎక్కడ పడతాయి, బావుల్లో నీళ్లు ఎక్కడ ఉంటాయి. వ్యవసాయం సజావుగా సాగడం ఎలా సాధ్యం? ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఈ పరిణామాలన్నీ కలగలసి అంతిమంగా అవని మీద మనిషి మనుగడని మాత్రమే కాదు, సమస్త జీవకోటి ఉనికిని సందిగ్ధంలో పడేసాయి. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ సమాజం చొరవ చూపింది. అడవుల్ని కాపాడుకోవటమే కాదు, అవనిని కాపాడుకోవడం, ఈ ధరిత్రి మీద బతికే సమస్త జీవకోటిని రక్షించుకోవడానికి ప్రయత్నించడం తక్షణ అవసరమని గుర్తించింది. కాలం గడుస్తున్న కొద్దీ భూమండలం మీద మనిషి అడుగుజాడల విస్తరణ, అభివృద్ధి పేరిట కొనసాగుతున్న విధ్వంసం చివరకు ధరిత్రి మనుగడకే పెనుప్రమదంగా మారింది. ఊహించని కాలంలో ఊహించని రీతిలో పెనుతుఫాన్లు సంభ వించడం, జన జీవనాన్ని అల్లకల్లోల్లం చేయడం వెనుక పర్యావరణ విద్వంసమే అసలు మూలమని తెలిసింది.

paryavarana-chaitanyam-adavitalliki-rakshana-7ఈ నేపధ్యంలో కొన్ని సంవత్సరాల కిందటనే ఐక్యరాజ్యసమితి చొరవ చూపింది. జీవకోటి వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తూ ముందుకు వచ్చింది. ఈ సందర్భoలోనే గత దశాబ్ది కాలంగా మే 22వ తేదిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జీవకోటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఏ నేల తమని కాపాడుతుందో ఆ నేల సుభిక్షంగా ఉండటానికి మనుషులు చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ జీవ వైవిధ్యం ద్వారా మనము ప్రకృతి నుండి పొందుతున్న వనరులకు, సేవలకు, వస్తువులకు ఎప్పటికి విలువ కట్టలేము. అయితే ప్రకృతి వనరులను అన్ని ఇతర జీవుల కంటే అత్యధికంగా ఉపయోగించుకుంటున్న మానవుల చర్యల వల్ల సాధారణ స్థితి కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా జీవ వైవిధ్యం విచ్చినం అవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భావితరాల మనుగడ అత్యంత దుర్లభమవుతుంది. ఇప్పటికే అడవుల్లో 45శాతం మేర ఆచూకి గల్లంతయింది. దీనివల్ల అనేక వృక్ష జాతులు అంతరించిపోవడంతో పాటు, వాటిపై ఆధారపడ్డ అనేక జంతువులకు ప్రమాదం ఏర్పడింది. ఈ విశ్వంలో ఈ భూమండలంలో ఈ జీవ చక్రములో మనకు ఎంత ప్రాదాన్యత ఉందొ, మిగిలిన అన్ని జీవ రాసులకు అంతే ప్రాధాన్యత ఉంది…….అని మానవుడు గ్రహించాలి. నాటి వేట కాలం నుంచి, నేటి పారిశ్రామిక యుగం వరకు, మనము ఇతర జీవులను, ఈ ప్రకృతిని జీవ వైవిధ్యాన్ని సకల వనరులను పరిహరిస్తూనే పోతున్నాము. ఫలితంగా ఇప్పుడు ఈ భూమి మీద మన అస్తిత్వమే అయోమయంలో పడిపోతుంది. జీవ వైవిధ్యం లేకపోతే మానవుని మనుగడ ప్రస్నార్ధకమవుతుందని తెలుసుకొని జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరం నడుం బిగించాలి.

బి.విజయ కుమారి, టీచింగ్ అసోసియేట్,
వి.ప్రసూన, టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

Share this post


Watch Dragon ball super