ఓజోన్ పొరను కాపాడుదాం

ఓజోన్ పొరను కాపాడుదాం

మనిషి మంచిగా బ్రతకాలంటే పర్యావరణాన్ని పదిలంగా కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకునే వారికెవరికయినా అన్నిటికంటే ముందుగా స్ఫురించేది భూమికి 15-20 కిలో మీటర్ల ఎత్తులో వుండే స్ట్రాటో స్పియర్ గురించి. బహుశా స్ట్రాటో స్పియర్ అని చెబితే చాలా మందికి తెలియక పోవచ్చుకాని అక్కడ నెలకొని ఉన్న ఓజోన్ పోర గురించి అని చెబితే అందరికి అవగతమవుతుంది.

ozone-poranu-kaapadudaam-1

ఓజోన్ పోర గురించి అయితే చాలా మందికి తెలిసే ఉండవచ్చు కాని అసలు ఓజోన్ ఎలా ఏర్పడుతుందనేది అంతగా తెలియకపోవచ్చు. మనిషికి ప్రాణవాయువు ఆక్సిజన్. రెండు అణువులు ఆక్సిజన్ కలిస్తే అది మనిషి ప్రాణవాయువైన ఆక్సిజన్ గా తయారవుతుంది. అయితే రెండు అణువులు ఆక్సిజన్ కాకుండా మూడు అణువులు ఆక్సిజన్ తయారయితే దాన్ని ఓజోన్ అంటారు. భూవాతావరణంలో ఓజోన్ సహజంగానే ఏర్పడుతుంది.

జర్మని శాస్త్రవేత్త క్రిస్టియన్ స్కోన్ బియన్ 1839వ సంవత్సరంలో ఓజోన్ వాయువును కనుగొన్నాడు. సూర్యకిరణాల శక్తి మూలంగా ఆక్సిజన్ మూలకం 2 ఆక్సిజన్ అణువులుగా విడిపోతుంది. ఇలా విడిపోయిన ఆక్సిజన్ అణువు సమీపంలోనేవున్న ఆక్సిజన్ మూలకంతో జతకట్టి ఓజోన్ గా ఏర్పడుతుంది. సూర్య శక్తి కారణంగా ఓజోన్ నిరంతరం తయారవుతూనే వుంటుంది.

అయితే మరోవైపు నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్ వంటి సహజ వాయువులు ఓజోన్ ను సష్టపరుస్తూవుంటాయి. ఈ విధంగా ఓజోన్ ఉత్పత్తి, నాశనం రెండు సమానంగా సహజ ప్రక్రియలుగా జరుగుతూనే వుంటాయి.

సాంకేతికాభివృద్ధి సాధించిన మానవుడి కార్యకలాపాల వల్ల ఓజోన్ ను నష్టపరచగలిగే కొన్ని రకాల వాయువులు అధికమొత్తాల్లో వాతావరణంలో కలుస్తున్నాయి. ఫలితంగా ఓజోన్ పొర క్రమంగా క్షీణిస్తూ పోతుంది.

వాతావరణంలో వుండే ఓజోన్ లో 90 శాతం ఓజోన్, స్ట్రాటోస్పియర్ లోనే వుంటుంది. కొంతమేర ఓజోన్ , స్ట్రాటోస్పియర్ క్రింది వాతావరణ పోర అయిన ట్రోఫోస్పియర్ లో వుంటుంది. ఓజోన్ రసాయనికంగా ఒకేలా వున్నపటికీ ఈ రెండు చోట్లా ఓజోన్ వేర్వేరుగా ప్రభావం చూపుతుంది. స్ట్రాటోస్పియర్ లో అతినీలలోహిత కిరణాల బారి నుంచి భూమిని కాపాడే రక్షణ కవచంగా ఓజోన్ పొర పనిచేస్తుంది. అదే ట్రోఫోస్పియర్ లో హానికర కాలుష్యంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఆలోచించవలసిన, విచారించవలసిన విషయమేమిటంటే, మానవ ప్రేరేపిత విచ్చలవిడి కార్యకలాపాల వలన స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ తగ్గిపోతూ ట్రోఫోస్పియర్ లో ఎక్కువవుతుoది.

ఓజోన్ పొర క్షీణిoచేందుకు కారణమయ్యే రసాయన వాయువులను “ఓజోన్ డిప్లీటింగ్ సబ్ స్టేన్సెస్” (O.D.S) అంటారు. ఈ రసాయనాలలో ప్రధానమైనవి క్లోరోఫ్లోరోకార్బన్స్ (C.F.C) మన దేశంలో C.F.C లను రిఫ్ర్రిజరేషన్, ఎయిర్ కండిషనర్లు, ఫామ్ లు, ఎరోసాల్స్, సాల్వెంట్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, పూమిగేషన్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తున్నారు. ఓజోన్ క్షీణతకు కారణమయ్యేవాయువులను స్ట్రాటోస్పియర్ లో 111 సంవత్సరాలపాటు కొనసాగుతాయి. ఫ్రిజ్ లు, ఎయిర్ కండిషనర్లు, ఎరోసాల్స్ లో ఉపయోగించేది ఈ వాయువులనే.

ozone-poranu-kaapadudaam-2

ఓజోన్ పొరకు చిల్లుపడినట్లు శాస్త్రవేతలు 1985లో తొలిసారి కనుగొన్నారు. అప్పటి ఆ చిల్లు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణానికి మూడిoతలుగా పెరిగింది. ఇదే క్రమంలో ఓజోన్ పొర తరిగిపోతే అతినీలలొహిత కిరణాలు భూమిని అధిక మొత్తాల్లో చేరుతాయి. ఫలితంగా మానవుల్లో చర్మ క్యాన్సర్, క్యాటరాక్ట్ వంటి కంటి సంభంద సమస్యలు పెరుగుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. విత్తనం మొలకెత్తేoదుకు అవసరమయ్యే సమయం పెరుగుతుంది. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది ఉష్ణాగ్రతల్లో కూడా మార్పులు జరుగుతాయి. ఓజోన్ పొరను క్షీణిoపచేసే కాలుష్యకాలను అదుపు చేసుకోలేనట్లయితే ప్రపంచ ఉష్ణోగ్రత 5.5 డిగ్రీల సెంటిగ్రేడుకు పెరగవచ్చునని శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధృవాలలోని మంచు కరిగి నదీపరివాహక ప్రాంతాలలోనూ సముద్రాల్లోనూ నీటిమట్టాలు పెరిగిపోయి వరదలు సంభవిస్తాయి అని శాస్త్రవేతల అంచనా.

ozone-poranu-kaapadudaam-4గత వందేళ్ళ కాలంలో సగటు ఉష్ణోగ్రతలు అర డిగ్రీ సెంటిగ్రేడ్ మేర పెరిగాయి. అంటార్కిటికా, చీలీ, పెరూ, హిమాలయాల వంటి ప్రాంతాలలో మంచు సాధారణ స్థాయికన్నా అధికంగా కరిగిపోతుండడానికి కారణం ఇదే. మిలీనియన్ల సంఖ్యలో ఉన్న కర్మాగారాలు, కార్లు, ఎయిర్ కండిషనిoగ్ ప్లాంట్ల వంటి వాటిలో శిలాజ ఇంధనాలను వినియోగించడం వల్ల కార్బన్ డై ఆక్సయిడ్ వంటి గ్రీన్ హౌజ్ వాయువులు గతంలో కంటే ఎక్కువుగా వాతావరణం లోకి విడుదుల కావటం వలన వాతావరణం వేదేక్కుతుందని ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లయిమేట్ ఛేoజ్ హెచ్చరిస్తుంది. ఏ చర్యలూ తీసుకోకుండా పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఈ శతాబ్దాoతానికి ఉష్ణోగ్రత మరో 6.4 సెంటిగ్రేడులు వరకు పెరగవచ్చని అంచనా వేస్తుంది. ఇదే జరిగితే మంచు కరిగి సముద్రమట్టాలు 18 నుంచి 59 సెంటి మీటర్ల మేర పెరిగి, తీర ప్రాంతాలు, ద్వీపాలు మునిగిపోయే ప్రమాదం వుంటుంది. తుఫానులు, వరదలు వంటివి తరచుగా వచ్చే అవకాశం వుంటుంది. వీటన్నిటి కారణంగా 2085 వ సంవత్సరం నాటికి 25 నుండి 40 శాతం వరకు వివిధ జాతుల ఆవాశాలు నాశనం కావచ్చు.

ఓజోన్ పొరను కాపాడుకోవడానికి వ్యక్తిగతoగా మనమేం చెయ్యగలం. మనం కొనుగోలు చేసే వస్తువులలో ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే పదార్ధాలు ఉన్నాయోలేదో తెలుసుకోవాలి. అవకాశo వున్నంత మేరకు ఓజోన్ ఫ్రెండ్లీ ఉత్పత్తులనే కొందాం. రిఫ్ర్రిజరేటర్లు, ఎయిర్ కండిషనర్లు తక్కువ రిపేర్లు వచ్చేవిధంగా జాగ్రత్తగా వాడుకుందాం. ఫామ్ దిళ్ళు, పరుపులకు బదులు దూది పరుపులు దిళ్ళను ఉపయోగిద్దాం. ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే పదార్ధాలను మనం పూర్తిగా వాడటం ఈ రోజే మానేస్తే మరో 40 సంవత్సరాలలో ఓజోన్ పొర తిరిగి యదాస్థితికి రాగలుగుతుంది.

వి.ప్రసూన, టీచింగ్ అసోసియేట్,
జి..వి.సుష్మ, టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

Share this post


Watch Dragon ball super