నేటి యువతిలో ఆహార సమస్యలు – తీసుకోవలసిన జాగ్రత్తలు

నేటి యువతిలో ఆహార సమస్యలు – తీసుకోవలసిన జాగ్రత్తలు

ఆహారము జీవిత ముఖ్య అవసరములలో ఒకటి. మన ఎదుగుదలకు, అనేక శరీర కార్యక్రమములకు ఆహారo అవసరం. ఆహారం తీసుకోకపోతే ఆకలి వేస్తుంది. పని చేయడానికి కావలసిన శక్తీ ఉండదు. పోషకాహార లోపాలు వస్తాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే తగిన పరిమాణంలో సమతులాహారాన్ని తిసుకోవాలి. తినేదల్ల ఆహారం కాదు. వివిధ ఆహార పదార్ధములు తగిన పరిమాణములో (quantity) , పాళములలో(quality) తీసుకోవాలి . అన్ని ఆహార పదార్ధాలలో పోషకాలు ఉన్నాయి, కానీ ఏ పదార్ధo లోనూ మన శరీరానికి కావలిసిన అన్ని పోషకాలు లభించవు. కనుక అన్ని రకాల ఆహార వర్గాల నుండి పోషకాలు అందేటటువంటి సమతుల ఆహారం చాలా అవసరం.

neti-yuvatilo-aahara-samsyalu-1

పసితనం ఛాయలు వీడి ఉత్సహం ఉరిమే ప్రపంచంలోకి అడుగిడే కీలక వయసు కౌమారాo. ఈ వయసులో శారీరక, మానసిక మార్పులతో పాటు హార్మోన్ల ప్రభావం కూడా ఉంటు౦ది. ముఖ్యoగా అమ్మాయిలకు తక్కిన దశల్లో కన్నా ఈ దశలో అధికంగా అనగా 2060 నుండి 2440 కేలరీల వరకు శక్తి అవసరం అవుతుంది.

సరైర మోతాదులో కేలరీలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలను తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ కేలరీలు ఎ రూపంలో అందుతున్నాయి అనేది ప్రత్యేకించి దృష్టి సారించాల్సిన విషయం. చిప్స్, పిజ్జాలు, శితల పానీయాల నుంచి కేలరీలను పొందడo సులువే. కానీ వాటి నుంచి శరీర నిర్మాణానికి సహకరించే పోషకాలు మాత్రం అందవు. దానిని దృష్టిలో ఉంచుకొని వారికి విటమిన్లు, మినరల్స్ తో కూడిన పోషకాహారాన్ని అందించాలి.

ఎదిగే వయసులో ఎముకలు బలంగా ఉండి తమ ఆసక్తులకు  తగ్గ రంగాల్లో దుసుకుపోవాలన్నా, శరీరమ౦తటికి ఆక్సిజన్ అంది ఉత్సాహంగా ఆలోచించాలన్నా ఆహారం నుంచి అందే కాల్షియం, ఐరన్ చాలా కీలకం.

జీవితాంతం ఎముకలు ఆరోగ్యంగా ఉండటం అనేది 90% నిర్దారితం అయ్యేది ఈ వయస్సులోనే.

ఈ వయసులో వారు  అధికంగా రక్తహీనత తో ఇబ్బంది పడుతున్నారు . ఎదుగుదల చురుగ్గా ఉండే ఈ  సమయంలో ఇనుము ఆవశ్యకత అoతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా రజస్వల సమయంలో రక్తహీనత ఏర్పడుతుంది. దాంతో శరీరంలో ఇనుము నిల్వలు తగ్గిపోతాయి. దాంతో చాలా అలసటకు గురవుతారు . నీరసం, నిస్సత్తువ అవహిస్తాయి. పని మీద, చదువు మీద శ్రద్ధ చూపించలేక పోతారు.

రక్తహీనత కు గురవకుండా ఉండాలంటే ఐరన్ బాగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఉదా: తాజా ఆకుకూరలు, కూరగాయలు, సీతాఫలం, అటుకులు, మరమరాలు, పుచ్చకాయ, కాలేయం , గుడ్డు, ఎండు ఫలాలు, అంటే ఖర్జూరం, అంజూర, ఎండు ద్రాక్ష వంటివి తినడం వల్ల ఇనుము పుష్కలంగా అందుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే విటమిన్ ‘సి’ పుష్కలంగా లభించే ఆహారాన్ని కూడా తీసుకుంటే ఐరన్ ను మన శరీరం బాగా గ్రహిస్తుంది. కనుక విటమిన్ ‘సి’ లభించే సిట్రస్ ఫ్రూట్స్ అనగా నిమ్మ, బత్తాయి, కమల, మరియు జామకాయ  వంటివి, బంగాళదుంప మొదలైనవి ఆహారంలో తీసుకుంటే రక్త హీనత రాకుండా కాపాడుకోవచ్చు. రోజుకి 17 mg ఐరన్ మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

neti-yuvatilo-aahara-samsyalu-4

ఎముకల బలాన్ని పెంచే కాల్షియం రోజుకు 800 వరకు అందాల్సి ఉంటుంది. కానీ చాలా మంది టీనేజర్లలో కాల్షియం లోపం అధికంగా ఉంటుందని అధ్యయాలు చెబుతున్నాయి. కాల్షియం తో పాటు విటమిన్ ‘డి, సి,కె, పొటాషియం , ఫాస్పారస్ లు ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. నేటి పరిగెత్తే ప్రపంచంలో ఉదయం త్వరగా బయలుదేరి రాత్రికి ఇంటికి చేరడం వలన సూర్యరశ్మి తగలక విటమిన్ డి శరీరానికి తగినంత అందకపోవడం వలన కూడా కాల్షియం లోపం తలెత్తుతుంది. దీని వలన త్వరగా ఎముకలు గుల్లబారడం, విరిగిపోవడం , చిట్లిపోవడం, వంగిపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పాల పదార్ధాలు, రాగులు, నువ్వులు, తోటకూర, కరివేపాకు, మునగాకు వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి మరియు రోజు అరగంట పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి ఆహారంతో పాటు పరుగు పెట్టడం, మెట్లెక్కడం, నాట్యం వంటి చర్యలు ఎముకల బలానికి సహాయపడతాయి

ఊబకాయం-  మారుతున్న జీవనశైలి , ఆహారపు అలవాట్లు బరువు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ (శుద్ధి చేసిన ఆహారం ) సులువుగా అందుబాటులో ఉండటం వలన వాటి వినియోగం ఎక్కువై  అధిక బరువుకు కారణమవుతుంది. దీనికి  తోడు శారీరక శ్రమ కూడా తగ్గిపోయింది. ఊబకాయం వలన అనేక రుగ్మతలుకు లోనవుతారు. పోషకాహార లోపం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మధుమేహం, రక్తపోటు, పి.సి.ఒ.డి. గాల్ బ్లాడర్ లో స్టోన్స్, గుండె జబ్బులు, అర్ధ్రరైటిస్ వంటి వ్యాధులుకు చిన్న వయసులోనే గురవుతున్నారు.

ఇటువంటి సమస్యలతో పాటు ప్రత్యేకంగా కొంతమంది అమ్మాయిలు ఈ వయస్సులో అనొరెక్సియ నెర్వోసా, బులీమియా నెర్వోస, బింజ్ ఈటింగ్ వంటి మానసిక ఆహార సమస్యలును  ఎదుర్కొంటున్నారు.

అనొరెక్సియ నెర్వోసా–  అంటే  సన్నగా ఉండాలనేది కాలేజీ అమ్మాయిల కల. లావైపోతామని భయంతో ఆకలిని చంపుకుంటారు. ఈ ఇబ్బంది యువతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సన్నగా కనిపించాలనే ఆలోచన తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆకలి లేదనే సాకుతో ఆహారానికి దూరంగా ఉంటారు. అతి కొద్ది పరిమాణంలో తింటారు. తినే ప్రతి పదార్ధాన్ని క్యాలరీల్లో లెక్కిస్తుంటారు. ఎక్కువగా బరువు చెక్ చేసుకుంటూ, తిన్న వెంటనే ఆ క్యాలరీలు ఖర్చు అవ్వడం  కోసం వ్యాయామం చేస్తారు. సాద్యమైనంత తక్కువ మోతాదుల్లో ఆహరం తీసుకుంటూ, శరీర బరువుకు టార్గెట్ పెట్టుకుని దాన్ని చేరుకున్నా ఇంకా తగ్గాలనే తాపాత్రయ పడుతూ ఉంటారు.

ఈ అనొరెక్సియ ప్రభావంతో అనీమియా, డిస్ మెనోరియా, (పీరియడ్స్ రాకపోవడం), విటమిన్ లోపం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

neti-yuvatilo-aahara-samsyalu-5

బులీమియనెర్వోసా– వీరు ఆహరం సరిగానే తీసుకుంటూనే బరువు పెరుగుతామేమోనని ఆలోచిస్తూ తిన్న వెంటనే బాత్రూమ్ కి వెళ్ళి నోట్లో వేళ్ళు పెట్టుకుని వాంతి చేసుకుంటారు. దీని మూలాన పదే పదే ఆసిడ్ రిప్లక్స్ జరిగి ఎసిడిటీ పెరుగుతుంది. మరి కొంతమంది మోషన్ అయ్యేట్లు లాక్సేటివ్స్ వంటి మందులు వాడుతారు. తద్వారా బరువు పెరగమనుకుంటారు. కానీ వీటి మూలాన సహజమైన గాస్ట్రో ఇంటెస్టెన్ మూమెంట్స్  తగ్గిపోయి భవిష్యత్తులో మలబద్దకాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. డీహైడ్రేషన్ మరియు పోషకాహార లేమితో ఇబ్బందులకు గురవుతారు.

neti-yuvatilo-aahara-samsyalu-6

బింజ్ ఈటింగ్– ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఆకలితో పనిలేదు. ఆకలిగా ఉన్నా, లేకున్నా తింటూనే ఉంటారు. దాంతో బరువు విపరీతంగా పెరిగిపోతారు. ఆహారాన్ని చూడగానే టెంప్ట్ అయి ఎక్కువ మోతాదులో కూడ తినేసి బరువు పెరుగుతారు.
ముందుగా ప్రతి ఒక్కరూ మనం తినే ఆహరం గురించి, ఆహారపు అలవాట్లు గురించి కొంత అవగాహన ఉండాలి. నిత్యం వ్యాయాయం చేస్తూ తగినంత ఆహరం తీసుకుంటే జీవక్రియలు చురుగ్గా ఉంటాయి.

  • ఎంత తింటున్నాం? ఏం తింటున్నాం  అనేది చూసుకోవాలి
  • సమయానికి తినాలి.
  • ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర, ఇన్సులిన్, స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
  • చిరు ధాన్యాలైన రాగి, జొన్న, కొర్ర, సజ్జ, మొదలైనవి తప్పకుండా వాడితే కాల్షియం, ఐరన్, పీచు వంటివి శరీరానికి అందుతాయి.
  • పండ్లు, కాయగూరలు నుండి శరీర పనితీరుకు కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలు, పీచు సమృద్ధిగా అందుతాయి.
  • పప్పుధాన్యాలు, గింజలు, మాంసకృత్తుల్ని అందిస్తాయి.
  • పెరుగు, మజ్జిగలో ప్రొబయోటిక్ గుణాలు అధికం అనగా ఇన్ఫ్క్షన్స్ రాకుండా కాపాడుతుంది. కాల్షియం కూడ లభిస్తుంది.
  • వయసు, బరువును బట్టి ఆహరం తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన యువతి రోజుకి 270- 300గ్రా  ధాన్యాలు, 60గ్రా పప్పుధాన్యాలు, 30 గ్రా మాంసాహారం, 150 గ్రా  పండ్లు, 200 గ్రా కాయగూరలు తీసుకోవచ్చు.
  • రుచికరమైన ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, పోషకాలతో నిండిన పదార్ధాలను ఎంచుకుని, తగినంత వ్యాయయం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.

పి.సి.ఒ.డి- పాలీ సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్: అధిక బరువు మూలాన పి.సి.ఒ.డి. కూడా వస్తుంది. దీనిని సమర్ధంగా ఎదుర్కోవడానికి పోషకాహారమే సరైన మార్గం. తాజా కూరగాయలు, పండ్లని సమృద్ధిగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పాలు, తృణ ధాన్యాలు, ఓట్స్, పెరుగు, సోయా ఉత్పత్తులు, చేపలు, పి.సి.ఒ.డి తీవ్రతను తగ్గుముఖం పట్టిస్తాయి.

Uday Lakshmi.K
Teaching Associate,
Department of FDNT,
C.H.Sc, ANGRAU,
Guntur.

Share this post


Watch Dragon ball super