మనదేశంలో స్త్రీల, పిల్లల స్థితిగతులు

మనదేశంలో స్త్రీల, పిల్లల స్థితిగతులు

ఏ సమాజ అభివృద్ధి అయినా ఆ సమాజంలోని పిల్లల, స్త్రీల స్థితిగతుల పై ఆధారపడి ఉంటుంది, ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ అభివృద్ధి బాగా ఉండి సిరిసంపదలతో వర్ధిల్లుతుంది అన్న నానుడి మనందరికి తెలిసినదే. మన సమాజాభివృద్ధిలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనది.

ఏ సమాజంలో అయిన స్త్రీలు ఆనందించే పరిస్థితులు వారి స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్థాయి సంఘంలోని సాంఘీక, ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది.

సమాజ స్థాయిని లేదా స్థితిగతులను అంచనా వేయడానికి ఆ సంఘంలోని స్త్రీల, పిల్లల స్థితిగతులు ఒక సూచనగా ఉపయోగపడ్తాయి. సమాజస్థాయి నీచస్థితిలో ఉండటం అన్నది సంఘంలోని స్త్రీల స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పండిత్ జవహర్ లాల్ నెహ్రు ఇలా అన్నారు ప్రజలను జాగృతం చెయ్యాలంటే మనం ముందుగా స్త్రీలను చైతన్యవంతులను చెయ్యాలి ఒక్కసారి స్త్రీలు జాగృతమై ముందంజ వేస్తే తర్వాత కుటుంబం ఆ బాటలోనే పయనిస్తుంది తర్వాత సంఘం, రాష్ట్రం, దేశం పురోగమిస్తాయి.

ఏ సమాజంలో అయితే స్త్రీలు గౌరవింపబడి శక్తిస్వరూపిణులుగా ఆరాధింపబడ్తారో ఆ సమాజ స్థితిగతులు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. అలాగే స్త్రీల స్థితిగతులు కూడ చాలా ఉన్నతంగా ఉంటాయి. పూర్వకాలంలో స్త్రీలు చాలా మంది ప్రధమ స్థాయిలో ఉన్నారు కాని కాలం గడిచేకొద్ది స్త్రీలను రెండవస్థాయి పౌరులుగా పరిగణిస్తున్నారు. వారికంటూ ప్రత్యేక హక్కులు లేక, విద్యలేక, పురుషాధిక్య సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ విధంగా స్త్రీల స్థితిగతులు తక్కువగా ఉండటానికి కారణాలు అనేకం. మనదేశ ఆర్ధిక అభివృద్ధిలో స్త్రీల పాత్ర చాలా తక్కువ, సుమారుగా 90% స్త్రీలు Unorganized sector లో పనిచేస్తున్నారు, వ్యవసాయరంగంలో స్త్రీలు 74%పాల్గోంటున్నా వారి స్థితిగతులు మెరుగ్గాలేవు. వ్యవసాయ సంబంధమైన శిక్షణలో చాలా మంది స్త్రీలు పాల్గోనడం లేదు అన్ని వ్యవసాయ పనుల్లో పాల్గోంటున్నా వారికిచ్చే వేతనాలలో లింగభేదాలు చూపిస్తున్నారు 1980 లో ప్రచురించిన UNESCOనివేదిక ప్రకారం పారిశ్రామిక దేశాలలో కూడ స్త్రీలు పురుషుల కంటే 30-40% తక్కువగా సంపాదిస్తున్నారు. అటు బయట పనులు చేస్తూ స్త్రీలు సుమారు రోజుకు 15-18 గంటలు పనిచేస్తున్నా వారు చేసే పనికి సరైన గుర్తింపు, ప్రతిఫలం లభించుటలేదు.

సాంఘీక హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్ల, స్త్రీల ఆర్ధిక పరిస్థితులు తక్కువగా ఉండటం వల్ల మన వివాహ విడాకుల సంబంధమైన చట్టాలలో లోపాలవల్ల స్త్రీల స్థితిగతులు మన దేశంలో మెరుగ్గా లేవు. పురుషాధిక్యత గల మనదేశంలో లింగభేదం అనేది స్త్రీల స్థితిని తక్కువగా ఉంచడానికి దోహదం చేస్తుంది. ఆడపిల్లలను ఆహార, ఆరోగ్య, విద్య, వినోద విషయాలలో మగపిల్లల కన్నా వేరుగా, తక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్త్రీలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గోనలేక పోతున్నారు. మన చట్టాలు స్త్రీ, పురుషులకు సమాన హక్కులున్నాయని చెప్తున్నా అవిద్య, పురుషాధిక్యత వల్ల స్త్రీలు తమ హక్కులను వినియోగించుకొనలేక పోతున్నారు, మన రాష్ట్ర, దేశస్థాయిలోని రాజకీయాలలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం ఉన్నా మనదేశంలో స్త్రీల అవిద్య 72% ఉంది.

స్త్రీలు అనేక రకాలైన భేద బాధలకు మరియు దోపిడికి(Exploitation) గురవుతున్నారు. రోజు రోజుకు వరకట్న చావులు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి 1990 సంవత్సరంలో అప్పటి రక్షణమంత్రి లోక్ సభకు సమర్పించిన నివేదిక ప్రకారం మనభారతదేశంలో ప్రతిరోజు వరకట్న దురాచారానికి సంబంధించి 1,479 ఆత్మహత్యలు, 878 హత్యలు జరుగుతున్నాయి. అంతేకాక ప్రతిరోజు 33 మంది స్త్రీలు మనదేశంలో ఎక్కడో ఒకచోట అత్యాచారానికి గురవుతున్నారు.

ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదిన మహిళాదినోత్సవంగా జరుపుకుంటున్నా అవి ఉపన్యాసాల వరకే పరిమితమవుతున్నాయి కాని వారి స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదు. ఏ దేశంలో అయినా స్త్రీల స్థితిగతులు ఈ అంశాల మీద ఆధారపడి ఉంటాయి. స్త్రీ శిశు మరణాల రేటు, స్త్రీల విద్య, స్త్రీల వివాహ వయస్సు, ఆడశిశువు భ్రూణ హత్యలు, స్త్రీ పురుష నిష్పత్తి, ఆమ్నిమోసింధసిస్, స్త్రీల ఉద్యోగపరిస్థితులు, స్త్రీల ఆస్తి హక్కులు, కుటుంబంలో, సంఘంలో బాలికల, స్త్రీల స్థాయి, రాజకీయ, ఆర్ధిక, సాంఘీక అభివృద్ధిలో స్త్రీల పాత్ర, సాంఘీక దురాచారాలు, సాంఘీకంగా, వ్యక్తిగతంగా స్త్రీలను అణచివేయడం.

స్త్రీలు, పిల్లల స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మనదేశంలోని జనాభా వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మనదేశ జనాభా ఇప్పుడు 100 మిలియన్లు దాటింది ఇందులో సుమారు 50% అంటే 50 మిలియన్లు స్త్రీలున్నారు. మన రాష్ట్ర జనాభా 7 కోట్లు మించి పోయింది కాని మనదేశంలోని స్త్రీల, పిల్లల స్థితిగతులు అంతమెరుగ్గా లేవు. ఇక స్త్రీ, పురుష నిష్పత్తిని పరిశీలిస్తే అది 1000 : 933 ఉంది అంటే ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు మాత్రమే ఉంటున్నారు మిగతా 67 మంది అనేక కారణాలవల్ల మరణిస్తున్నారు.

స్త్రీల, పిల్లల మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం మనదేశంలో స్త్రీల వివాహం ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో చిన్న వయస్సులోనే అంటే 15 సంవత్సరం లోపే జరగడం. ఎన్నో సంస్కరణలు,చట్టాలు, చదువులు అమలులో ఉన్నా అది మనదేశంలో స్త్రీల వివాహ వయస్సు మీద ఎలాంటి ప్రభావం చూపడం లేదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వివాహ వయస్సు చాలా తక్కువ ఇది ఎన్నో అనర్ధాలకు దారితీస్తున్నది. ఎందుకంటే బాల్యవయస్సులోనే వివాహం వల్ల స్త్రీలు శారీరకంగా, మానసికంగా ఎదిగి ఉండరు. బిడ్డ బిడ్డకు జన్మనిచ్చే పరిస్థితి వస్తుంది, దీనివల్ల అనారోగ్యంగా, బలహీనంగా ఉన్న పిల్లలు పుట్టడమే కాక స్త్రీకి కానుపు కష్టం అయ్యి స్త్రీ, శిశు మరణాలు అధికం అవుతున్నాయి, మనదేశంలో ప్రసవం వల్ల, గర్భం వల్ల సంభవించే స్త్రీ మరణాల రేటు ప్రతి లక్షకు 408 ఉంటున్నాయి.

స్త్రీల, పిల్లల మరణాలరేటు ఎక్కువగా ఉండటానికి కారణం స్త్రీల ప్రసవాలు ఎక్కువగా అంటే 60%తర్ఫీదు పొందని ఆయాలచే ఇంటి దగ్గర జరగడం 17% ప్రసవాలు మాత్రమే ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇక మనదేశంలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరిగే తీరు కూడ స్త్రీల స్థితిగతులను తెలుపుతున్నాయి. ప్రతి 100 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో 94 ఆపరేషన్లు స్త్రీలు చేయించుకోగా మిగిలిన 6% మాత్రమే పురుషులు చేయించుకొంటున్నారు అంటే పిల్లలను కని, పెంచడం, గృహనిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు కూడ మన సంఘంలో స్త్రీలనే ఎక్కువగా ఉపయోగించుకొంటున్నారు దీనికి అనేక అపొహలు ముఖ్యకారణం.

పిల్లల స్థితిగతులు విషయానికి వస్తే మన భారత దేశ జనాభాలో అధిక శాతం పిల్లలున్నారు సుమారు 380 మిలియన్లు 14 సంవత్సరాలలోపు వారే, 1999 వ సంవత్సరం బాలల దినోత్సవం అంశం”Children – India’s strength” అని చెప్తూ పిల్లలకు ప్రాముఖ్యత నిచ్చారు, పిల్లల అభివృద్ధికి చేసిన 50 సంవత్సరాల కృషి ఎంతో గొప్పది అయినా ప్రతి సంవత్సరం 2 మిలియన్లు పిల్లలు చనిపోతున్నారు. ఈ మరణాలు చాలా మట్టుకు నివారింపదగినవే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 33% అపోషణకు గురవుతున్నారు, 66% పిల్లలు మాత్రమే 5వ తరగతికి చేరుకుంటున్నారు. వీరిలో 5వ తరగతి చదివిన పిల్లలు చాల మంది చదవడం, వ్రాయడం చేయలేకపోతున్నారు. 17 మిలియన్ల పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారు, 5 మిలియన్ల పిల్లలు వీధి బాలలుగా ఉన్నారు అంతేకాక 4,00,000 మంది బాల్యవేశ్యలుగా ఉన్నారు, ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు అంగవైకల్యంతో బాధపడ్తున్నారు పిల్లల మీద జరిగే అత్యాచారాలు, నేరాలు రోజు రోజుకు అధికం అవుతున్నాయి.

ఇక బాలికల స్థితిగతుల విషయానికి వస్తే మన భారతదేశ జనాభాలో నాల్గవవంతు 19 సంవత్సరాలలోపు బాలికలు ఉన్నారు, ప్రతి సంవత్సరానికి 12 మిలియన్ల బాలికలు పుడ్తున్నారు వీరిలో 3 మిలియన్ల బాలికలు వారి 15 వ పుట్టిన రోజు వరకు జీవించి ఉండటంలేదు. బాలికల ఆహార, పోషణ స్థాయిలు బాలురతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 5 – 9 సంవత్సరాలలోపు ఉన్న నిరక్షరాస్య పిల్లల్లో ఎక్కువ శాతం బాలికలే. యవ్వన వయస్సులోని బాలికలు అనేక రకాలైన అఘాయిత్యాలకు గురవుతున్నారు.
శిశుమరణాల విషయానికి వస్తే మానవ వనరుల అభివృద్ధి విభాగం నిర్వహించిన అనేక కార్యక్రమాలవల్ల శిశుమరణాల రేటు 120 నుంచి 71 కి తగ్గినా (ప్రతి వెయ్యికి 71 మంది) ప్రతి ఏడాదికి 2 మిలియన్ల శిశువులు మరణిస్తున్నారు, ఇందులో సుమారు 70% మరణాలు పుట్టిన నెలలోపు జరుగుతున్నాయి, ఇవేకాక తల్లిగర్భంలోనే ఉన్న శిశువు ఆడపిల్ల అని తెలిసిన వెంటనే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు ప్రసవం అయిన వెంటనే బిడ్డ ఆడపిల్ల అయితే పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. ఇక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు గమనిస్తే ఆడపిల్లల మరణాలు మగపిల్లల మరణాలతో పోలిస్తే 43% ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో శిశుమరణాలు 52% ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని గమనిస్తే శిశుమరణాలు ముఖ్యంగా ఆడశిశువుల మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఆడపిల్లలను మన సమాజంలో చిన్నచూపు చూడటమే. అంతేకాక సంఘాలలో ఆడపిల్లల పెంపకం, పెళ్ళి, సంబంధిత కార్యక్రమాలకు/ సంబరాలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు తమకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకొంటున్నారు. అలాంటప్పుడు రెండోసారి కూడ ఆడపిల్ల పుట్టే సూచనలు ఉన్నప్పుడు ఇలా భ్రూణహత్యలకు, శిశుహత్యలకు పాల్పడుతున్నారు, కొన్ని సమయాల్లో గర్భధారణ అయిన వెంటనే అమ్నిమోసింథసిన్ పరీక్ష వల్ల పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అన్న విషయాన్నితెలుసుకొని ఆడపిల్ల అని తెలిసిన వెంటనే అబార్షన్లకు పాల్పడుతున్నారు.
ఈ శిశుమరణాలకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి, అందులో ప్రీమెచ్యూరిటీ ఒకటి అంటే బిడ్డకు నెలలు నిండకుండానే పుట్టడం, దీనివల్ల సంబంధించిన మరణాలు 48% ఉన్నాయి. మనదేశంలో విభేదాల వల్ల సంభవించే మరణాలు 7% ఉన్నాయి దీనికి కారణం అపరిశుభ్రత, నీటికాలుష్యం.

పై విషయాలన్ని గమనిస్తే మన దేశంలో స్త్రీల, పిల్లల స్థితిగతులు అంత మెరుగ్గా లేవని చెప్పుకొనవచ్చును, దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం 13 మంత్రిత్వ శాఖల ద్వారా, డిపార్టుమెంటుల ద్వారా స్త్రీల, పిల్లల అభివృద్ధికి 120 పైగా స్కీములు, కార్యక్రమాలను చేపట్టింది, అంతేకాక సుమారు 30,000 స్వచ్ఛంద సేవా సంస్థలు స్త్రీల, పిల్లల అభివృద్ధికి పాటుపడ్తున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే మరణాల రేటును 9 కి తగ్గించడం , జననాలరేటును 21కి తగ్గించడం, శిశుమరణాల రేటును 60 కి తగ్గించడం.

Share this post


Watch Dragon ball super