చిరుధాన్యాలతో అద్భుతాలు

చిరుధాన్యాలతో అద్భుతాలు

నేడు ఈ శాస్త్ర పరిశోధనా రంగం మొత్తం కూడా ధాన్యాలలో ఈ చిరుధాన్యాలు వేరని ఇవి చిన్నగా ఉన్నా ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉన్నాయని తెలియచేస్తున్నాయి. చిరుధాన్యాలలో శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వగలిగే పోషకపదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి, ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చిరుధాన్యాలు చూడడానికి చిన్నగా ఉన్నా పోషకవిలువల పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి, ఇన్ని ఔషధగుణాలు కలిగి ఉన్నందున వీటిని న్యూట్రాస్యూటికల్స్ అని కూడా అంటారు. న్యూట్రాస్యూటికల్స్ అనేవి ఆహారపదార్థాలలో నిక్షిప్తమై ఉన్న సహజసిద్ధమైన జీవక్రియాత్మక రసాయన పదార్ధాలు. ఏదైనా పోషకాహారలోపాన్ని సవరించడానికి గాని, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు గురికాకుండ కాని ప్రత్యేకమైన ఆహారంగా ఇస్తారు. వీటిలో ఉండే పోషకాలకు మరియు ఔషధగుణాలకు మనిషి వ్యాధులకు గురికాకుండా కాపాడే శక్తి ఉంది.

chirudhanyalato-adbhutaalu-4

ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, ఆర్దరైటిస్, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి రుగ్మతులను అదుపులో ఉంచడంలో చిరుధాన్యాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిరుధాన్యాలలో పీచు, త్వరగా జీర్ణం కాని పిండిపదార్థాలు ఉంటాయి. పిండిపదార్థాలు ఆలస్యంగా జీర్ణం అవడం, పీచు నుండి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవడం వల్ల మధుమేహం రోగులకు మంచి ఆహారం. చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునే వారు బరువు పెరగరు, కనుక ఊబకాయులు చిరుధాన్యాలను తీసుకోవడం చాలా ఉత్తమం. వరి, గోధుమలతో పోల్చుకుంటే చిరుధాన్యాలలో ఖనిజలవణాలు, విటమిన్లు వంటి పోషకాలు ఐదు రెట్లు అధికంగా ఉంటాయి. వరితో పోల్చిచూస్తే రాగిలో కాల్షియం 30% అధికంగా ఉంటుంది. ఇతర చిరుధాన్యాలలో 2% ఎక్కువ. చిరుధాన్యాలు మొత్తంలో సజ్జలలో ఖనిజలవణాలు అధికంగా ఉంటాయి. కొర్రలు మరియు సామలలో ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది. వివిధ రంగులలో ఉండే చిరుధాన్యాలలో యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. చిరుధాన్యాలలో సజ్జలలో సూక్ష్మఖనిజలవణాలైన జింక్, ఇనుము, మెగ్నీషియం,పాస్ఫరస్ మరియు ఫోలిక్ యాసిడ్ అను బి విటమిన్లు అధికంగా ఉంటాయి. రాగులలో ఇనుము,కాల్షియమ్ అధికంగాను క్రొవ్వులు తక్కువగాను ఉంటాయి, ఉన్న క్రొవ్వులు కూడా అన్ సాచ్యురేటెడ్ క్రొవ్వు ఆమ్లాలే. వీటిలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు అయిన లైసిన్, త్రియోనిన్, వాలైన్, మితయోనిన్ ఎక్కువగా ఉంటాయి. చిరుధాన్యాలలో గ్లూటిన్ అనే మాంసకృత్తులు ఉండవు, అందువల్ల గ్లూటిన్ అలర్జీ కలిగిన వారికీ ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక రకం చిరుధాన్యాలను భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇతర ధాన్యాలలా కాకుండా చిరుధాన్యాలను పొట్టు తీయకుండానే వాడవచ్చు, అందువల్ల పొట్టులో ఉండే బి విటమిన్లు థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ ను నష్టపోకుండా ఉంటాము. చిరుధాన్యాల పొట్టులో ఉన్న ఫీనాలిక్, ఫ్లావినాయిడ్లు, టానిస్స్ ఎన్నో రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ని, ఖనిజలవణాలను బంధించి కణాలను కాపాడుతాయి. ఆక్సీకరణ చర్యలను నివారించి, కణాల పొరలలో ఉండే క్రొవ్వులను స్థిరపరచడం వల్ల క్యాన్సర్ మరియు వయస్సు పైబడిన లక్షణాలను యాంటి-ఆక్సిడెంట్లు నివారిస్తాయి. చిరుధాన్యాలలో ఉండే పాలికోసినాల్ అనే పదార్థం గుండె జబ్బుల వైద్యంలో ఉండే స్టాటిన్ తో సమానమైనది, కాబట్టి ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఈ కారణంగానే చిరుధాన్యాల వాడకంపై అందరు దృష్టిపెడుతున్నారు. పులియపెట్టడం, మొలకెత్తించడం వలన ఫీనాలిక్ శాతం తగ్గినప్పటికీ ఇతర పోషకాల స్థాయి పెరిగి, శరీరం వాటిని గ్రహించుకునేలా చేస్తాయి. అందువల్ల చిరుధాన్యాలను ఎప్పుడు పొట్టు తీయకుండానే ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు పొట్టు తీయని సజ్జలలో ఫీనాలిక్ శాతం 297మి .గ్రా. /100గ్రా. అయితే పొట్టు తీసిన ప్రోసెసింగ్ చేసిన వాటిలో 257మి.గ్రా. / 100గ్రా. లకు పడిపోవడం జరుగుతుంది.

ప్రస్తుత వైద్యరంగంలో అవలంభిస్తున్న పద్ధతులలో చాలా వరకు ఖర్చుతో కూడుకున్నవి. అలా కాకుండా చౌకగా లభించే పదార్థాలు ఆరోగ్యానికి సంపూర్ణంగా తోడ్పడుతున్నాయని తెలియడం వలన అందరు చిరుధాన్యాలపై దృష్టి సారించడం మొదలుపెడుతున్నారు.

ఉదాహరణకు:

రాగులు: రాగులలో ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. శరీరం పెరుగుదల మరియు ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి., రక్తం గడ్డకట్టడంను నిరోధిస్తాయి. కండరచలనం, గుండె సజావుగా పనిచేయడానికి దోహదపడతాయి. వీటిలోని పీచుపదార్థాలు మధుమేహవ్యాధిగ్రస్తులకు మేలుచేస్తాయి. చంటి పిల్లలకు అనుబంధ ఆహారంగా కూడా రాగి జావను ఉపయోగించవచ్చు.

chirudhanyalato-adbhutaalu-1

సజ్జలు: సజ్జలలో ఇనుము తగిన మోతాదులో ఉండడం వలన శరీరానికి శక్తిని, పుష్టిని కలిగిస్తాయి. వీటిలో క్రొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బాలింతలలో, పాలిచ్చే తల్లులలో వచ్చే రక్తహీనతను నివారిస్తాయి.

chirudhanyalato-adbhutaalu-6

జొన్నలు: జొన్నల్లో మాంసకృత్తులు, బి-విటమిన్లు, పీచుపదార్థం అధికంగా ఉంటాయి, వీటిని పొట్టుతీసి ఉపయోగించడం వల్ల కూడా ఎటువంటి నష్టం ఉండదు. దీని వల్ల రుచి, నాణ్యత పెరుగుతుంది. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఉత్తమమైన ఆహారం.

chirudhanyalato-adbhutaalu-3

సామలు: శక్తి మరియు పెరుగుదలకు తోడ్పడతాయి, రక్తహీనతను నివారిస్తాయి మరియు సీలియాక్ జబ్బు నివారణకు అనువైన ఆహారం మరియు మలబద్దకంను అరికడతాయి.

chirudhanyalato-adbhutaalu-5

కొర్రలు: ఇవి శరీరం పెరుగుదల, నిర్మాణానికి తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం మరియు మధుమేహులకు చెక్కర నియంత్రణలో తోడ్పడుతాయి.

chirudhanyalato-adbhutaalu-2

Share this post


Watch Dragon ball super