చెల్లని కండిషన్లు

చెల్లని కండిషన్లు

chellani-conditionlu-1మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా సేవలను పొందుతున్నప్పుడు వ్యాపారులు కొన్ని రకాల కండిషన్లు మన మీద రుద్దుతూ ఉంటారు. బట్టలు కొన్నామనుకోండి. ఒకసారి అమ్మిన దుస్తులు తిరిగి తీసుకోనబడవు. అని బిల్లు మీద ముద్రించి మరీ చెప్తారు. మా వద్ద కొన్న బట్టల రంగులకు గ్యారంటీ లేదని మరొకాయన స్పష్టంగా చెప్పేస్తారు. ఇంత నిర్భయంగా తమ బట్టల నాణ్యత గురించి చెప్పేసి కొన్న వారి కర్మ ఫలం మీద బట్టల నాణ్యత ఆధారపడి ఉన్నట్లు మొహం పెట్టేస్తారు. పెళ్ళికో, సభలు, సమావేశాలు నిర్వహించేందుకో ఏదైనా కళ్యాణ మండపాన్నో, కాన్ఫరెన్స్ హాలు నో ముందుగా రిజర్వు చేసుకున్నామనుకోండి. ముందుగా కొంత అడ్వాన్సు చెల్లించాలి. ఆ అడ్వాన్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వమని వాళ్లు మనకు ఇచ్చే రిసిప్ట్ లో స్పష్టంగా ముద్రించి ఇస్తారు.

విద్యార్ధుల కళాశాలలలో, ముఖ్యంగా వృత్తి విద్యా కళాశాలలలో భారీ ఫీజులు చెల్లించినప్పుడు కూడా బిల్లుల మీద “ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫెండెడ్” అని ముద్రిస్తున్న సంఘటనలు ఉన్నాయి.

ఇలాంటి మరెన్నో రకాల కండిషన్లు వ్యాపారులు విధించటం మనందరికీ తెలిసిందే. కాని ఇలా వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఏకపక్షంగా నిర్ణయించే కండిషన్లు చెల్లవు.

కొన్న బట్టల నాణ్యత సరిగా లేకపోయినా, రంగులు వెలిసిపోయినా, వాటిని వాపసు ఇచ్చి ఏ లోపాలు లేని కొత్త వాటిని పొందవచ్చు, ముందుగా అనుకున్న రీతిలో ఫంక్షన్ ను జరపలేకపోయినప్పుడు హాలును బుక్ చేసుకొన్నప్పుడు చెల్లించిన అడ్వాన్సును తిరిగి పొందవచ్చు.

కళాశాలలు అందించే సేవలను విద్యార్ధులు పూర్తిగా ఉపయోగించుకోక మునుపే కళాశాలను వదిలిపెట్ట వలసి వస్తే, వారు కూడా తాము చెల్లించిన ఫీజులో కొంత భాగాన్ని తప్పకుండా తిరిగి పొందవచ్చు.

chellani-conditionlu-2వినియోగదారుల రక్షణ చట్టం వచ్చిన తరువాత ఇంటువంటివన్ని సాధ్యమయ్యాయనుకుంటే పొరపాటే. దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఇటువంటి విషయాల మీద ప్రశ్నించి విజయం సాధించారు మున్నుస్వామి అనే ఆయన. ఆయన డ్రైక్లీనింగుకు ఇచ్చిన పట్టు చీరను లాండ్రీ వాళ్లు ఎక్కడో పోగొట్టారు. అది కొత్త చీర కనుక పూర్తి ధరను వాపస్సు ఇవ్వాలని మున్నుస్వామి కోరారు. లాండ్రీ వాళ్ళిచ్చిన రిసిప్టు వెనుక చాలా కండిషన్లు ఉన్నాయి. ఒక వేళ దుస్తులు పోతే, కేవలం సగం ధరను మాత్రమే లాండ్రీ చెల్లిస్తుందని వాటిలో ఒకటి. ఆ సగం ధరనైనా పొందాలంటే ఆ దుస్తులను కొన్న బిల్లును కస్టమర్ చూపించాలి. ఈ కండిషన్లు చెల్లవంటూ హైకోర్టు పేర్కొంటూ చీర పూర్తి ధరను ఫిర్యాదికి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.

కనుక బిల్లులు మీద ముందే ముద్రించేశాం చూసుకోండి, ఇక మేము ఇప్పుడేం చేయలేమంటూ వ్యాపారులు అంటే మనం ఒప్పుకోనవసరం లేదు. అమ్మే వస్తువులు లేదా అందించే సేవల్లో లోపాలు ఉంటే ఇలాంటి కండిషన్లను తప్పకుండా ప్రశ్నించాలి.

జి.వి.సుష్మ, టీచింగ్ అసోసియేట్,
బి.విజయ కుమారి, టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

Share this post


Watch Dragon ball super