బంగారు తూకంలో తేడా ఎలా జరుగుతుందంటే

బంగారు తూకంలో తేడా ఎలా జరుగుతుందంటే

దసరా పండుగ పురస్కరించుకొని ఓ మహిళ తాను కొన్ని సంవత్సరాలుగా కూడబెట్టిన డబ్బుతో చిన్నపాటి బంగారు చైను లేదా కమ్మలు కొనేందుకు పట్టణానికి వెళ్ళింది. పేరు పొందిన బంగారు షాపులోకి వెళ్లి రూ.30,000 లు పెట్టి ఓ చైను కొనింది. కొద్దిరోజుల అనంతరం చైను కాస్త తెగటంతో పట్టణానికి ఎందుకు వెళ్లాలిలే గ్రామంలో ఉన్న బంగారు షాపుకు వెళ్ళి మరమ్మత్తు చేయించుకుందామని వెళ్ళింది. ఆ సమయంలో బంగారు షాపు అతను ఆ చైనును తూకం వేయగా అసలు బరువులో ఒక గ్రాము బంగారం తక్కువ వచ్చింది. దీంతో తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ తక్కువ వచ్చింది ఒక గ్రామే అయిన ధర అక్షరాల రూ.3000. దీన్నిబట్టి చూస్తే తెలుస్తుంది ఆ మహిళా ఎంత నష్టపోయిందో…

bangaram-tukalo-jarige-tedaalu-1

మరో ఓ సేల్స్ రిప్రజెంటేటివ్ తనకొచ్చిన అరియర్స్ తో నగల దుకాణానికి వెళ్ళి తన భార్యకు రెండు రకాల నగలను తీసుకోవడం జరిగింది. కొంత కాలం తరువాత ఒక నగలో చిన్నపాటి లోపం రావడంతో తాను కొన్న నగల దుకాణానికి వెళ్ళి మరమ్మత్తు చేయించుకుని తూకం వేయించగా 5 మి.గ్రా. తక్కువ వచ్చింది. అదే విషయాన్ని దుకాణ యజమానితో అడుగగా వాడిన నగ కదా సార్ తరుగు వచ్చి ఉంటుంది అని బుకాయించాడు. తాను నగలను కొనే సమయంలో తూకాన్ని సరిగ్గా చూడక నిర్లక్ష్యం వహించిన పాపానికి తనకు ఇది తగిన శాస్తి అని నిట్టూర్పు విడిచాడు. సేల్స్ రిప్రజెంటేటివ్ కు తగ్గింది 5 మి.గ్రా. అయినప్పటికీ నష్టపోయినది మాత్రం రూ.1500లు పైమాటే దీన్ని బట్టి చూస్తే గ్రాము తగ్గినా ఆర్ధికంగా ఎంతగా నష్టపోతామన్నది. ఈ సృష్టిలో బంగారంపై మోజు లేనిదెవ్వరికి మహిళలైతే తిండినన్నా వదిలేస్తారు గాని బంగారాన్ని మాత్రం వదలరు…! మహిళలను ఆకర్షించడానికి ఇటీవల కాలంలో నగల షాపుల వారు ఎన్నో అప్రకటిత ప్రకటనలు చేస్తుండటం నిత్యo అటు పత్రికల్లోను ఇటు టివీల్లోనూ చూస్తున్నాం. ఈ ప్రకటనలను నమ్మి ఆ షాపులలో నగలను కొంటూ నిత్యం ఎంతోమంది నష్టపోతున్నారు. తాము మోసపోయిన విషయాన్నీ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియక వారిలో వారే బాధపడేవారెందరో. ఇటువంటి వారి కోసం మోసపోయి సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి న్యాయం పొందే బదులు ముందే మనం మోసపోకుండా ఉంటే చాలు కదా… ఇటువంటి వారి కోసం ఈ శీర్షిక…

bangaram-tukalo-jarige-tedaalu-2మార్కెట్లో ప్రస్తుత బంగారు, వెండి ధర నిలకడగా లేదు. గతంలో నెలకు, రోజుకు పెరిగే బంగారం ధర నేడు గంట… గంటకు పెరుగుతుంది.  వివిధ సంధర్బాలలో కొన్ని జ్యూయలరీ షాపులు డిస్కౌoట్, ఆకర్షనీయమైన బహుమతులు ప్రకటిస్తుండగా, మరికొన్ని ఒక గ్రాము వద్ద రూ.50 లేదా రూ….తగ్గింపు అంటూ ప్రకటనలూ గుప్పిస్తున్నాయి. ఇంకొన్ని తరుగులేదు, మజూరి లేదు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పెళ్ళిళ్ళు, పండుగలు ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారు ఆభరణాలు కొనడం రివాజు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వినియోగదారులు బంగారం స్వచ్ఛత, తూకం విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణ పరిస్థితుల్లో సైతం అవగాహన లేక ఎక్కువ మంది బంగారం తూకాన్నిసరిగ్గా పట్టించుకోరు. మౌనంగా ఉండిపోతుంటారు. ఇక శుభకార్యాలప్పుడు అయితే చెప్పకర్లేదు. గ్రాము… వినడానికి, చూడడానికి తక్కువగా అనిపించినప్పటికీ వాటి ధర వేలల్లో ఉంటుంది. బంగారం, వెండి కొనుగోలు సమయంలో కాస్తంత జాగ్రత్త, అప్రమత్తత, తూనిక పట్ల అవగాహన వ్యవహరిస్తే చాలు మనం మోసపోకుండా ఉండవచ్చు.

ఇవి జాగ్రత్తలు:

• ది ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ – 2011 లో 9 ప్రకారం బులియన్ తూనిక రాళ్ళతో మాత్రమే బంగారం, వెండిలను తూకం వెయ్యాలి.
• ప్రీసియస్ స్టోన్స్ తో కరక్ట్ వెయిట్స్ మాత్రమే తూకం వెయ్యాలి.
• జ్యూయలరీ షాపులో బంగారం, వెండి, ప్రీసియస్ స్టోన్స్(డైమండ్స్, జెమ్స్, పెరల్స్ మొదలగునవి)తూకం వేయడానికి ఒక మిల్లీ గ్రాము ఆక్యురేసి కలిగిన క్లాస్ – 1, క్లాస్ – 2 ఎలక్ట్రానిక్ కాటాలను మాత్రమే వినియోగించాలి లేదా క్లాస్- ఎ.క్లాస్-బి కేటగిరీ మెకానికల్ కాటాలు(త్రాసులు)లో మాత్రమే తూకం వేయాలి.
• ప్రతి జ్యూయలరీ షాపు స్వచ్ఛతను తెలియజేసే క్యారెట్లు, నిఖర బరువు, గ్రాము ధర, మొత్తం ఎంత అనేది బిల్లులో తప్పని సరిగా ఉండాలి. విలువైన రత్నాలు నిఖర బరువును బిల్లుల్లో రాయాలి.
• ఇత్తడి తూనిక రాళ్ళను ప్రభుత్వం నిషేదించింది. బులియన్ తూనిక రాళ్ళును మాత్రమే తూకం వేయడానికి వినియోగించాలి.
• తూనిక వేయు కాటా సక్రమంగా ఉందా/లేదా? అని తెలుసుకునేందుకు వినియోగదారుని తనిఖి నిమిత్తం ¼ సామర్ధ్యం కలిగిన టెస్ట్ వెయిట్స్ జ్యూయలరీ షాపు వద్ద ఉండాలి.
• బంగారు క్యారెట్లను తనిఖి చేసే అధికారం లీగల్ మెట్రాలజీ అధికారులకు ఉంది.
• తరుగు పేరుతో కొన్ని జ్యూయలరీ షాపులు నగదు వసూలు చేస్తున్నాయి. ఏ చట్టంలోనూ తరుగు అనేది లేదు.
• ‘వాల్యూ ఏడేడ్’ పేరుతో ఇంకొన్ని జ్యుయాలరీ షాపులు వినియోగదారుల నుంచి బంగారం నిఖర బరువుతో నిమిత్తం లేకుండా అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం.
• రాళ్ళతో కూడిన వస్తువులు కొన్నప్పుడు ఆ రాళ్ళ బరువును ప్రత్యేకంగా తూకం వేయమని కోరాలి.
• బంగారం దుకాణాల్లో వాడుతున్న ఎలక్ట్రానిక్ కాటాలు సరైనవో కావో ముందు చూసుకోవాలి. కాటాపై ఒక పక్క ‘జి’ మరోపక్క ‘o’ ఉన్నప్పుడు మాత్రమే వస్తువులను తూకం వేయించాలి.
• గాలి ఉన్న/వచ్చు ప్రదేశంలో తూకం వేయరాదు. తూకం వేసినప్పుడు ఫ్యాను తిరిగితే అపమనాలి. గాలి వలన తూకంలో తేడా వస్తుంది.
• కేడీఎం బంగారం అనేది ఎక్కడ లేదు. కేడీఎం బంగారం అంటూ కొన్ని జ్యూయలరీ షాపులు చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదు. కేడీఎం అంటే… కాడ్మియం సోల్డార్డ్ గోల్డ్. అతుకు పెట్టడానికి కాడ్మియాన్ని ఉపయోగిస్తారు. కేడీఎం నగలను కరిగిస్తే క్యారాటేజి మారదు. అయితే కేడీఎం నగలకు మజూరీ (మేకింగ్ చార్జి)ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్చత క్యారేట్లలో ఉంటుంది.
• కొన్ని జ్యూయలరీ షాపులు బంగారం, నగలు కొనుగోలు సమయంలో వినియోగదారులకు హామీ ఇస్తుంటాయి. వినియోగదారులు తిరిగి అమ్ముతున్నప్పుడు మాత్రం తరుగు కింద పది శాతం వరకు తగ్గించడం జరుగుతుంది.
• బంగారు షాపుల్లో క్లాస్-3 తూనికయంత్రాలు నిషేదిoచబడ్డాయి. షాపుల్లో ఉన్నా చర్యలు తప్పవు. కొ న్ని షాపులు ఇంకా వినియోగిస్తున్నాయి. ఈ సంధర్భాల్లోనే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి.

ఇవీ మోసాలు:

bangaram-tukalo-jarige-tedaalu-5• పాత బంగారం ఇచ్చి కొత్త వస్తువు తయారు చేయమన్నపుడు కొందరు దుకాణదారులు తరుగు అంటూ పది శాతం వరకు తగ్గిస్తున్నారు. పాత బంగారం ఎంత ఉందో అదే బరువులో కొత్త బంగారo ఇవ్వాలి.
• రాళ్ళ నెక్లెస్లు, ఉంగరాలు, చెవిదిద్దులు, గాజులు మొదలగునవి అమ్మినప్పుడు రాళ్ళ బరువును ప్రత్యేకంగా చూపాలి. అయితే కొంతమంది వర్తకులు రాళ్ళను కలిపి అమ్ముతుంటారు. దీనివల్ల వినియోగదారులు మోసపోతున్నారు.
• కొందరు తూకాలలో మార్పులు ద్వారా కనీసం రెండు గ్రాముల బంగారాన్ని మాయం చేస్తుంటారు. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.
• బంగారం అమ్మినప్పుడు ఒక కాటా, కొన్నప్పుడు మరొక కాటాను కొంతమంది వర్తకులు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో వినియోగదారులు (కొనుగోలుదారులు) అప్రమత్తంగా ఉండాలి.
• కాటా సరైనదా ? కాదా?అని అనుమానం వస్తే, ఆ షాపులో ప్రభుత్వ ముద్ర వేసిన తూకపు రాళ్ళు వేసి కాటా చూడమని కోరవచ్చు. అలా చేయడానికి వ్యాపారి అంగీకరించకపోతే తక్షణం తూనికలు – కొలతల శాఖ అధికారికి ఫిర్యాదు చెయ్యాలి.
• గతంలో ఒక మిల్లీ గ్రాము లాంటి బరువు రాళ్ళు లేకపోవడం వలన పెద్ద ఎత్తున మోసాలు జరిగేవి. కానీ నేడు అలా జరగకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కాటాలను ఏర్పాటు చేయడంతో వినియోగదారులు కాస్త మోసపోవడం తగ్గిందనవచ్చు.

వెండిలో స్వచ్ఛత ఎంత ?

bangaram-tukalo-jarige-tedaalu-7ఇటీవల కాలంలో బంగారంతోపాటు వెండి ధరలు సైతం ఆకాశన్నంటుతున్నాయి. వెండి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. వివాహ వేడుకల్లో నూతన వధూవరులకు, గృహ ప్రవేశాలకు వెండి వస్తువులు బహుకరిoచడం బాగా పెరిగింది. ఖరీదైన బహుమానం ఇస్తున్నామని సంతోషిస్తున్నారు కానీ అందులో వెండి ఎంత స్వచ్ఛత ఉంటుందో తెలుసుకునే వారు చాలా తక్కువ. బంగారానికి హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చెయ్యాలని యోచనకు వచ్చిన ప్రభుత్వం వెండి నాణ్యత పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వెండి వస్తువు కొనుగోలు చేసినప్పుడు బిల్లుపై వెండి నాణ్యత ఎంత ఉంటుందో దుకాణదారులతో తప్పని సరిగా నమోదు చేయిస్తేనే వినియోగదారులకు హామీ లభిస్తుంది. బంగారం స్వచ్ఛతను బట్టి వినియోగదారులు చెల్లిస్తున్నారు. అదే వెండి వస్తువుల్లో వెండి స్వచ్ఛత తక్కువగా ఉన్న దుకాణదారులు నూరు శాతానికి ధర వసూలు చేస్తున్నారు. ఈ వస్తువుల నాణ్యత నిర్ధారణకు హాల్ మార్కింగ్ వంటి నిబంధనలు అమలు కావడం లేదు. వెండి నాణ్యత నిర్ధారణ ప్రక్రియ స్వచ్ఛoదంగా మాత్రమే ప్రస్తుతం అమలవుతుంది. బంగారం హాల్ మార్కింగ్ ప్రక్రియకు ఇచ్చే నోటిఫికేషన్ లోనే వెండిని కూడా జతచేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా కిలో వెండి కడ్డీలో 925 గ్రాముల స్వచ్ఛత ఉంటే, స్టెర్లింగ్ సిల్వర్ గా పరిగణిస్తారు. ఇలాంటి 92.5 స్వచ్ఛత కలిగిన వెండి మిశ్రమంతోనే వెండి వస్తువులు, ఆభరణాలు తయారు కావాల్సి ఉంది. గతంలో వెండి ధర తక్కువగా ఉన్నందున స్వచ్ఛతను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కిలో ధర రూ.70000కు చేరుకుంది, పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు నాణ్యతపై దుకాణదారులను అడిగి తెలుసుకోవాలి. స్వచ్ఛత పై తగిన నిబంధనలు లేక అధిక శాతం 75-80 శాతం వెండితోనే వస్తువులు తయారు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అంటే కిలో వెండికి డబ్బు చెల్లిస్తే 750-800 గ్రాముల స్వచ్ఛత కలిగిన వెండి మాత్రమే మనకు లభిస్తోందన్నమాట…!

ఈ జాగ్రత్తలు తీసుకుందాం:

bangaram-tukalo-jarige-tedaalu-10వెండి వస్తువులు కొనుగోలు చేసినప్పుడు దుకాణదారుని వద్ద వెండి నాణ్యతకు సంబంధిoచిన గ్యారoటీ ధృవీకరణ పత్రం తీసుకోవాలి.
బిల్లు తప్పని సరిగా పొందాలి.
బిల్లు రాస్తే వ్యాట్ కట్టాల్సి వచ్చినా ఆ సొమ్మును కట్టి రసీదు పొందటం మంచిది. రూ.లక్ష విలువైన వస్తువుకు రూ.1000లు మాత్రమే అదనంగా అవుతుంది. అప్పుడే స్వచ్ఛతకు భరోసా వస్తుందని గుర్తించాలి.
వెండి ఆభరణాలకు తయారీ చార్జిల కింద గ్రాముకు రూ.2.50 వరకు వసూలు చేస్తున్నారు. నగిషీ పని ఉంటే ఇది గ్రాముకు రూ.10ల వరకు వసూలు చేస్తున్నారు.
వెండి ఆభరణం మాదిరే తరుగు కింద 5-10 శాతం వెండికి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇంత చెల్లిస్తున్నాం కనుక అవసరమైతే నాణ్యత పరిక్షించమని దుకాణదారున్ని కోరవచ్చు.
వెండి వస్తువుల్లో మిశ్రమంగా రాగి కలుపుతారు. వెండిలాగా భ్రమింపచేసే జర్మన్ సిల్వర్ను జత చేస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. వెండి పాత్రను రాయిపై గట్టిగా రుద్ది, హైడ్రో క్లోరిక్ యాసిడ్ వేస్తే పాలు మాదిరి తెల్లగా పొంగుతుంది. అదే రాగి శాతం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం ఆకుపచ్చటి రంగులో మారుతుంది. జర్మన్ సిల్వర్ను మూసలో కరిగిస్తే ఆవిరి అవుతుంది.

వి.ప్రసూన, టీచింగ్ అసోసియేట్,

బి.విజయ కుమారి, టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

Share this post


Watch Dragon ball super