ఆరోగ్యాన్ని కాపాడే స్టీమ్ కుకింగ్

ఆరోగ్యాన్ని కాపాడే స్టీమ్ కుకింగ్

తేలికగా, ఆవిరి మీద ఉడికించిన ఆహార వినియోగం ఇటీవల కాలంలో ఎక్కువఅయ్యింది. నేరుగా నీటిలో ఉడికించిన, నూనెలో వేయించిన పదార్ధాలతో పోల్చినప్పుడు ఆవిరి మీద వండిన పదార్ధాలలోని పోషకాలు చెదరకుండా నిలిచి ఉండటమే ఇందుకు కారణం. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద పెరిగిన అవగాహనే ఈ మార్పుకు మరో కారణం. నిజానికి ఆవిరి మీద వండటమనే పద్ధతి వందలాది ఏళ్లుగా భారతదేశం తో సహా పలు దేశాల్లో వాడుకలో ఉన్నదే. దీనికే ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన పాత్రలు, ఎలక్ట్రికల్ కుక్కర్ లు, వెదురుతో చేసిన పాత్రలూ అందుబాటులోకి వచ్చాయి.

aarogyaani-kaapade-steam-cooking

నీటిలో ఉడికించటం, నూనెలో వేయించటం కంటే ఆవిరి మీద వండుకోవటం చాలా సులభం. వేగంగా వంట పూర్తవటమేగాక చౌక కూడా. ఏ పదార్ధాన్ని ఎంత ఆవిరిలో ఎంత సమయం ఉడికించాలనేది తెలిస్తే వాటిలోని సహజ పోషకాలను కోల్పోకుండా చూడొచ్చు. ఆవిరి వంట వల్ల కూరగాయల సహజరూపం, రంగు, సువాసన, అందులోని పీచు యధాతధంగా అందుతుంది. అంతేగాక ఆ పదార్ధాల్లో ఉండే నీటిలో కరిగే విటమిన్లు కూడ చెదరిపోవు. ఆవిరి మీద వండిన ఆహారంలో వేపుళ్ల మాదిరిగా అదనపు క్రొవ్వు వంటివి లేకపోగా కేలరీలుతక్కువే గనుక ఊబకాయులకు, రువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నయం.

కూరగాయల్లో ఉండే బి, సి విటమిన్లు నీటిలో సులభంగా కరిగిపోతాయి. కాబట్టి వీటిని నీటిలో వండే బదులు ఆవిరి మీద ఉడికిస్తే ఆ సమస్య రాకపోవటమే గాక కూరగాయల్లోని విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ మెరుగుపడుతుంది.

క్యాబేజీ, బ్రకోలి, కాలిఫ్లవర్ వంటి కూరగాయల్లో లభించే పోషకాలకు కెన్సర్ తో సహా పలు ప్రమాదకరమైన కణితులను నివారించే శక్తి ఉంది. అయితే వాటిని ఆవిరి మీద ఉడికించినప్పుడే ఆ పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఆవిరి మీద ఉడికిస్తే కూరగాయలు గుజ్జుగానో, నీరునీరుగా కాకుండా కోసినప్పటిలాగానే ఉంటాయి. ఆవిరి వంటకాలు తేలిగ్గా జీర్ణమవటమే గాక అందులోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించుకోగలుగుతుంది. దీనివల్ల కడుపుబ్బరం, తేపులు, మలబద్ధకం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.

ఎలా ఉడికించాలి?

స్టీమర్ సాయంతో…

స్టీమర్ లోని క్రింది అరలో తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి. ఆవిరి పట్టగానే కూరగాయల ముక్కల పై అరలో అమర్చాలి. మరుగుతున్న నీటికి, పైన కూరగాయలకు మధ్య కనీసం 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలామగ్గిన కూరగాయ ముక్కల్లో సహజసిద్ధమైన పోషకాలన్నీ చెదరకుండా నిలిచి ఉంటాయి.

స్టీమర్ లేకుండా…

బాగా కాచిన నీటి పాత్రకు కాస్త ఎత్తులో చిల్లుల గిన్నెను పెట్టి అందులో ఆకుకూరలు, కూరగాయ ముక్కలు లాంటివి నేరుగా ఉడికించుకోవచ్చు.

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. రోజువారి ఆహారంలో ఆవిరి మీద ఉడికించిన పదార్ధాలను తీసుకోవడం ద్వారా పలు రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

Share this post


Watch Dragon ball super